కోటి ఉత్తరాల ఉద్యమానికి పిలుపు
మజ్దూర్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపల్లి శ్రీనివాస్
బాన్సువాడ, నవంబర్ 22 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈపీఎఫ్ వో, ఈపీఎస్-95 పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాలంటే ప్రత్యేక అదనపు పెన్షన్ ఆర్థిక నిధి చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టి అమలు చేయాలని మజ్దూర్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాపల్లి శ్రీనివాస్(Janata Party founding president Rapalli Srinivas) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా సమకూరుతున్న జీఎస్టీ ఆదాయం(GST revenue), కేంద్ర బడ్జెట్లో కనీసం ఒక శాతం నిధులను పెన్షనర్ల అదనపు పెన్షన్ కోసం కేటాయించాలని ఆయన సూచించారు.ఈ నెల 19న గుజరాత్‌లోని గిర్‌లో జరిగిన ఈపీఎఫ్ వో,సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో పెన్షన్ పెంపుపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ప్రస్తుత పెన్షన్ మొత్తాలు(Pension amounts) పెన్షనర్ల కనీస జీవన అవసరాలకు కూడా సరిపోవడం లేదన్నారు. ఈపీఎఫ్ వో, ఈపీఎస్-95 పెన్షనర్లతో పాటు బీడీ కార్మికులకు కనీస నెలవారీ పెన్షన్ రూ.6,000గా నిర్ణయించాలని, రిటైర్డ్ ఉద్యోగుల నెలవారీ పెన్షన్‌ను రూ.9,000కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లక్ష్య సాధనకు ప్రత్యేక అదనపు పెన్షన్ ఆర్థిక నిధి ఏర్పాటు చేసి, దానికి చట్టబద్ధత కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం నవంబర్ 16, 2026 నుంచి డిసెంబర్ 21, 2026 వరకు దేశవ్యాప్తంగా చేపట్టిన కోటి ఉత్తరాల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని రాపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెన్షనర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమంలో భాగస్వాములై కేంద్ర ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేయాలని కోరారు.పెన్షనర్లకు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ ఆర్థిక నిధి చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.