జబర్దస్త్ టీమ్‌కు రోడ్డుప్రమాదం

22-11-2026 | 09:18am

జబర్దస్త్ టీమ్‌కు రోడ్డు ప్రమాదం.. రైజింగ్ రాజు, దొరబాబుకు గాయాలు!

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు(Jabardasth Team Accident) చెందిన సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కమెడియన్లు రైజింగ్ రాజు(Rising Raju Accident), దొరబాబుకు గాయాలైనట్లు సమాచారం. దీంతో వారి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. జబర్దస్త్ టీమ్ సభ్యులు కాకినాడ నుంచి భీమవరం వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి(West Godavari Road Accident) జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

ఆస్పత్రికి తరలింపు.. అభిమానుల్లో ఆందోళన

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన రైజింగ్ రాజు, దొరబాబుతో పాటు ఇతరులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గాయాల తీవ్రత, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. తమ అభిమాన కమెడియన్లకు ప్రమాదం జరిగిందన్న వార్తతో జబర్దస్త్ ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు