కమ్మేసిన పొగమంచు.. వాహనదారుల అవస్థలు
సదాశివనగర్, నవంబర్ 22 (విజయక్రాంతి): మండలవ్యాప్తంగా శనివారం ఉదయం దట్టమైన పొగమంచు (Fog) కమ్మేసింది. తెల్లవారుజాము నుంచి సుమారు రెండు గంటల పాటు మంచు తొలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పద్మాజీవాడి, సదాశివనగర్, ధర్మారావుపేట, ముదేగాం, కల్వరాల్ తదితర గ్రామాలతో పాటు కామారెడ్డి ప్రధాన రహదారిపై దట్టమైన మంచు అలుముకుంది. దీంతో ఐదు మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనదారులు హెడ్లైట్లు (Headlights) వెలిగించి అప్రమత్తంగా నెమ్మదిగా ప్రయాణించారు. ఆర్టీసీ బస్సులు కూడా ఆలస్యంగా నడిచాయి.
చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ఉదయం పనులకు వెళ్లే కూలీలు, రైతులు ఇబ్బందులు పడ్డారు. పొలాల్లోని వరి పంటలపై మంచు ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా చలి తీవ్రత (Cold Wave) క్రమంగా పెరుగుతోందని స్థానికులు తెలిపారు. మరోవైపు ప్రకృతి ప్రేమికులు మంచు అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు.