మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత

29-11-2026 | 04:07pm

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ (Political) వర్గాల్లో విషాదం నెలకొంది. ఇటీవల అనారోగ్యం తీవ్రం కావడంతో నవంబర్ 23న కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో కన్నుమూశారు.

1943లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఉంగుటూరులో జన్మించిన రాయపాటి 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 1996, 1998, 2004, 2009, 2014 ఎన్నికల్లో లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 2014లో తెలుగుదేశం పార్టీలో (TDP) చేరారు. అదే ఏడాది నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. రాజకీయాలతో పాటు విద్యా, వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. పలు విద్యాసంస్థలను స్థాపించి విద్యారంగానికి సేవలందించారు.

రాయపాటి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం (Political Career) కలిగిన నేత మృతి పట్ల అనేక మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు