అనంతగిరి ఘాట్లో ఘోర ప్రమాదం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతగిరి ఘాట్ రోడ్డులోని బుగ్గరామేశ్వరం సమీపంలో లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఓ మలుపు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది.
పెండ్లిమడుగు గ్రామం నుంచి కేరెళ్లి వైపు ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొనడంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు.
మృతులను పెండ్లిమడుగు గ్రామానికి చెందిన చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత, నాగేష్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మృత్యువాత పడటంతో పెండ్లిమడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు (Police Case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.