స్వతంత్ర సంస్థలా? సర్కారు కీలుబొమ్మలా?
వెంకగారి భూమయ్య :
ప్రజాస్వామ్యానికి కాపలాదారులు గా ఉండాల్సిన రాజ్యాంగ సంస్థలు(Constitutional Institutions) పాలకుల రాజకీయ పంజరంలో బందీలైతే ప్రజాస్వామ్యానికి సమాధి కట్టినట్టే! అధికారానికి ఊడిగం చేయడానికి కాదు సంస్థలున్నది.. రాజ్యాంగాన్ని కాపాడటానికే. ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఎన్నికలు పెట్టడంం, ఓట్లు లెక్కింపు, ఫలితాలు(Vote counting, results) ప్రకటించడమే కాదు.. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే వ్యవస్థలుగా ఉండాలి.
పాలకుల నిర్ణయాలకు అడ్డుకట్ట వేయగల స్వతంత్రసంస్థలుగా ఉండాలి. అధికార దుర్వినియోగాన్ని నిలదీయగలగాలి. కానీ నేడు దేశంలో స్వతంత్ర సంస్థల స్వయంప్రతిపత్తిపై జరుగుతున్న చర్చలు ప్రజాస్వా మ్యానికి పెను హెచ్చరికగా మారుతున్నా యి. సంస్థలు స్వతంత్రంగా పనిచేయాల్సిన చోట ప్రభుత్వ నీడలో నడుస్తున్నా యనే అనుమానాలు బలపడితే అది కేవలం ఒక సంస్థ ప్రతిష్ఠకు సంబంధించిన సమస్య కాదు. దేశ ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాద ఘంటిక.
మరి స్వతంత్రత ఎందుకు?
రాజ్యాంగ సంస్థలు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి ఏర్పడిన కార్యాలయాలు కావు. ప్రభుత్వ నిర్ణ యాలకు గుడ్డిగా తలూపే ముద్ర వేసే యంత్రాలు అంతకంటే కావు. ప్రజల ప్ర యోజనాలను, రాజ్యాంగ విలువలను కా పాడాల్సిన బాధ్యత వాటిపై ఉంది. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా నిర్ణ యాలు తీసుకుంటేనే స్వతంత్ర సంస్థలుగా గుర్తింపు వస్తుందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిజాన్ని చెప్పే ధైర్యం లేకపోతే ఆ సంస్థలకు స్వయంప్రతిపత్తి ఉన్నట్టా? పాలకులే జవాబు చెప్పాలి. స్వతంత్రత అనేది ప్రభుత్వానికిచ్చే కానుక కాదు. అది ప్రజాస్వామ్యం కల్పించిన రాజ్యాంగ బాధ్యత.
పెద్ద నోట్ల రద్దు.. అగ్నిపరీక్ష!
2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. సామాన్య ప్ర జలు బ్యాంకుల ముందు క్యూలో నిలబడ్డారు. చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపో యారు. పేదల జీవనాధారాలు దెబ్బతిన్నాయి. ఇంతటి కీలక నిర్ణయం విషయం లో రిజర్వ్ బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించిందా? ప్రభుత్వ నిర్ణయాన్ని లోతుగా పరిశీలించిందా? లేదా ముందే తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసిందా? అనే ప్రశ్నలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు కాపలాదారుగా ఉండాల్సిన కేంద్ర బ్యాంకు ప్రభుత్వ నిర్ణయాల ముందు స్వతంత్రతను కోల్పోతే సామాన్యుడి ఆర్థిక భద్రతకు దిక్కెవరు? ప్రభుత్వా నికి నచ్చిన నిర్ణయమే సరైనదని చెప్పే సంస్థకు స్వతంత్ర సంస్థ అనే పేరెందుకు?
ఎన్నికల సంఘం ఎవరి కోసం?
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది ఓటు. ఆ హక్కును కాపాడాల్సిన ది ఎన్నికల సంఘం. అది ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు. అధికార పార్టీకి ఒక కొలమానం, ప్రతిపక్షానికి మరో కొలమానం ఉంటే అది నిష్పక్షపాత అనిపించుకోదు. ఎన్నికల కోడ్ అందరికీ సమానంగా వర్తించాలి. అధికార బలం, ధనబలం, రాజకీయ పలుకుబడి ఎన్నికల ను ప్రభావితం చేయకుండా చూడాలి. ఈసీ నిర్ణయాలపై ప్రజల్లో అనుమానాలు పెరగడం అంటే ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతుంది.
నిష్పక్షపాతం పగటి కలే!
స్వతంత్ర సంస్థల స్వేచ్ఛను దెబ్బతీసే మొదటి అడుగు వాటి నియామకాల నుం చే మొదలవుతుంది. కీలక పదవుల్లో ఎవరిని నియమిస్తున్నారు?వారి అర్హత ఏంటి? వారి ఎంపికలో పారదర్శకత ఉందా? రా జకీయ విధేయతకు ప్రాధాన్యతనిస్తున్నా రా? అనే ప్రశ్నలు తప్పనిసరిగా రావాలి. అధికార పార్టీకి అనుకూలమైన వ్యక్తులనే కీలక పదవుల్లో నియమిస్తే భవిష్యత్తులో ఆ సంస్థలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయనే నమ్మకం ఎలా కలుగుతుం ది? అందుకే నియామక ప్రక్రియలో అధికార, ప్రతిపక్షాల భాగస్వామ్యం, పారదర్శ కత, అర్హతలకు ప్రాధాన్యముండాలి. సం స్థల పునాదులనే రాజకీయ ప్రయోజనాలతో కలుషితం చేస్తే వాటి నుంచి నిష్ప క్ష పాతాన్ని ఆశించడం పగటికలే అవుతుంది.
స్వతంత్రత అంటూ తప్పించుకోలేరు!
అయితే స్వయంప్రతిపత్తి అంటే ప్రశ్నించడానికి వీల్లేని అధికారం కాదు. ప్రభుత్వ జోక్యం ఉండకూడదన్న పేరుతో సంస్థలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. అధికార దుర్వినియోగం జరిగినా, నిర్ణయాల్లో తప్పులు దొర్లినా, ప్రజా ప్ర యోజనాలకు విరుద్ధంగా వ్యవహరించినా ప్రశ్నించే వ్యవస్థ ఉండాలి. ప్రజాస్వామ్య పర్యవేక్షణ, పార్లమెంటరీ సమీక్ష, న్యాయపరమైన పరిశీలనకు సంస్థలు జవాబు దారీగా ఉండాలి. కానీ ఈ పర్యవేక్షణ రాజకీయ కక్షసాధింపుకు ఆయుధంగా మార కూడదు. ప్రభుత్వ పెత్తనం ఒక ప్రమాదమైతే, జవాబుదారీతనం లేని స్వతంత్రత మరో ప్రమాదం. ఈ రెండింటి మధ్య రా జ్యాంగ సమతుల్యతే ప్రజాస్వామ్యానికి రక్షణ.
రాజ్యాంగం కంటే పాలకులు గొప్పా?
దేశంలో అధికారాలు శాశ్వతం కావు. ప దవులు శాశ్వతం కావు. ప్రభుత్వాలు శాశ్వ తం కావు. కానీ రాజ్యాంగం శాశ్వత విలువలతో నిలబడాలి. నేడు అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు. అందుకే తమకు అనుకూలంగా ఉన్నప్పుడు సంస్థల స్వతంత్రతను సమర్థిస్తూ, ప్రతికూల నిర్ణయాలు వచ్చినప్పుడు వా టిపై దాడి చేసే ద్వంద్వ వైఖరిని రాజకీయ పార్టీలు విడనాడాలి. ప్రజాస్వామ్యం అం టే పాలకుల ఇష్టమే చట్టం కాదు. ప్రజల హక్కులే దాని ప్రాణం. రాజ్యాంగ సంస్థలు పాలకుల కరతాళ ధ్వనులకు అనుగుణం గా పనిచేసే వేదికలుగా మారితే ప్రజాస్వా మ్యం కేవలం ఎన్నికల తంతుగా మిగిలిపోతుంది.
సంస్థలు బతికితేనే..!
ఎన్నికల సంఘం కావచ్చు, రిజర్వ్ బ్యాంకు కావచ్చు, మరే ఇతర రాజ్యాంగ సంస్థ కావచ్చు.. వాటి విధేయత ప్రభుత్వాల పట్ల కాదు, రాజ్యాంగం పట్ల ఉండా లి. వాటి నిర్ణయాలకు ప్రాతిపదిక రాజకీ య ప్రయోజనాలు కాదు, ప్రజా ప్రయోజనాలు కావాలి. అధికారాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం పాలన కాదు. ప్రశ్నలకు సమాధానం చెప్పడం, విమర్శలను స్వీకరించడం, తప్పులను సరిదిద్దుకోవడమే ప్రజాస్వామ్య పరిపక్వత. సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూసే పాలకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. అధికారం ప్రజలు ఇచ్చేది.. రాజ్యాంగం పరిమితులు విధించేది! స్వతంత్ర సంస్థలను బలహీనపరిస్తే చివరకు బలహీనమయ్యేది పాలకులు కాదు.. ప్రజాస్వామ్యమే!
వావ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్, 9848559863