ఆకలిపై ధరల దండయాత్ర!

06-11-2026 | 05:25am

ఒకప్పుడు సామాన్యుడి ఇంట్లో కూరగాయల ధరలు(Prices) పెరిగితే వారాంతపు బడ్జెట్ కొంత తారుమారయ్యేది. ఇప్పుడు పరిస్థితి అంతకంటే తీవ్ర మైంది. బియ్యం, గోధుమలు, పప్పులు, ఉల్లిగడ్డ, చక్కెర, పాలు, గుడ్లు, చికెన్.. ఇలా నిత్యావసర పదార్థాలు ధరల ఒత్తిడికి గురవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వంటగది ఖర్చు పెరుగుతోంది. కుటుంబ ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఈ అంతరమే సామాన్యుడి జీవితాన్ని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆహారం మనిషి ప్రాథమిక హక్కు. కానీ వాటి కొనుగోలే భారంగా మారితే, అది కేవలం మార్కెట్ సమస్య కాదు.. సామాజిక, ఆర్థిక న్యాయానికి సంబంధించిన ప్రశ్న.

పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం

కేంద్ర గణాంకాల శాఖ లెక్కల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతానికి చేరిం ది. మొత్తం వినియోగదారుల ద్రవ్యోల్బ ణం 5.54 శాతంగా నమోదైంది. ఆగస్టులో ఆహార ద్రవ్యోల్బణం 5.97 శాతం ఉండగా, ఒక్క నెలలోనే గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం సుమారు 10 శాతానికి చేరవచ్చని ఇండియా రేటింగ్స్ ఆర్థికవేత్త దేవేంద్ర పంత్ అంచనా వేస్తున్నారు. ఇది భవిష్యత్ అంచనే అయినా, ఆందోళన కలిగించే హెచ్చరికగా చూడాలి.

వానల ప్రభావం ధరలపైనా? 

భారత్‌లో వ్యవసాయానికి వర్షాకాలం ప్రాణాధారం. పొలంలో విత్తనం పడటానికి, మొక్క ఎదగడానికి, పంట చేతికి రావ డానికి నీరు అత్యవసరం. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువగా నమోదైంది. భారత వాతావరణ శాఖ గణాం కాల ప్రకారం జూన్  సెప్టెంబర్ మధ్య దేశంలో 759.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 868.6 మి.మీ.తో పోలిస్తే 12.56 శాతం లోటు ఉంది. బలహీనమైన వర్షాలు, నేలలో తేమ తగ్గడం, నీటి నిల్వలపై ఒత్తిడి యాసంగి పంటల సాగుకు సవాళ్లుగా మారవచ్చు.

ఎల్ నినో పరిస్థితులు కూడా వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశంగా చర్చలోకి వస్తున్నాయి. అయితే ప్రతి ప్రాంతంలో వర్షాభావం, పంట దిగుబడి తగ్గుదల ఎల్ నినో వల్లే జరుగుతున్నదని చెప్పడం శాస్త్రీయంగా సరైంది కాదు. స్థానిక వర్షపాతం, నీటిపారుదల, నేల తేమ, పంటల విస్తీర్ణం, సాగు విధానాలు, ఉష్ణోగ్రతలు వంటి అంశాలన్నింటినీ పరిశీలించాలి. అయినప్పటికీ వాతావరణ అని శ్చితి పెరుగుతున్న నేపథ్యంలో ఆహార సరఫరా వ్యవస్థను ముందుగానే సిద్ధం చేయ డం ప్రభుత్వాల బాధ్యత.

ధరల వెనుక సరఫరా సంక్షోభం..

ఆహార ధరలు పెరగడానికి ఒక్క కార ణం ఉండదు. పంట దిగుబడులు తగ్గడం, నిల్వ సదుపాయాల కొరత, రవాణా ఖర్చు లు పెరగడం, ఇంధన ధరల ప్రభావం, మధ్యవర్తుల పాత్ర, మార్కెట్‌లో సరఫరా అంతరాయాలు, అంతర్జాతీయ వస్తు ధరలు, రూపాయి విలువలో మార్పులు.. ఇవన్నీ కలిసి ధరలపై ప్రభావం చూపుతాయి. గోధుమలు, బియ్యం, పప్పులు, చక్కెర, ఉల్లిగడ్డ ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. పాలు, గుడ్లు, చికెన్ వంటి ప్రొటీన్ ఆహారాల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. పౌల్ట్రీ పరిశ్రమలో మొక్కజొన్న, సోయాబీన్ వంటి పశుగ్రాస పదార్థాల ఖర్చు ఉత్పత్తి వ్యయంలో కీలక భాగం.

పశుగ్రాసం, రవాణా, ప్యాకేజింగ్, విద్యుత్, ఇంధన వ్యయాలు పెరిగితే చివరకు వినియోగదారుడే ఆ భారాన్ని భరించాల్సి వస్తుంది. చికెన్, పాలు, గుడ్లు, పప్పులు కేవలం విలాసవంతమైన ఆహార పదార్థాలు కావు. పిల్లల ఎదుగుదలకు, మహి ళల ఆరోగ్యానికి, వృద్ధుల పోషకాహారానికి అవసరం. ధరలు పెరిగినప్పుడు తక్కువ ఆదాయ కుటుంబాలు వీటి వినియోగాన్ని తగ్గించుకుంటే, ఆర్థిక స్తోమత ఆరోగ్య సమస్యగా మారుతుంది. ఆకలి కనిపించకపో యినా, పోషకాహార లోపం నిశ్శబ్దంగా పెరిగే ప్రమాదం ఉంటుంది.

రైతు నష్టపోతున్నాడా? 

వ్యవసాయ మార్కెట్‌లో ఒక విచిత్రమైన వైరుధ్యం తరచూ కనిపిస్తుంది. రైతు పంటను తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. అదే పంట పట్టణాల్లోని వినియోగదారులకు అధిక ధరకు అందు తుంది. మధ్యలో నిల్వ, రవాణా, మార్కెటింగ్, వ్యాపార మార్జిన్లు, సరఫరా అంత రాయాలు ధరల వ్యత్యాసాన్ని పెంచుతాయి. అందువల్ల ధరల పెరుగుదల అంటే రైతు ఆదాయం పెరిగిందని భావించడం పొరపాటు.

ప్రభుత్వ విధానాల లక్ష్యం రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం, వినియోగదారుడికి సరసమైన ధరకు ఆహారం అందించడం అనే రెండు అంశాలను సమన్వయం చేయడం కావాలి. రైతుకు న్యాయమైన ధర లభించకపోతే వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. వినియోగదారుడు అధిక ధరలతో ఇబ్బందిపడితే కుటుంబ జీవన ప్రమాణాలు క్షీణిస్తాయి. ఈ రెండు వర్గాల మధ్య సమతుల్యతను సాధించడమే ప్రజా విధానాల అసలు పరీక్ష.

ద్రవ్యోల్బణం పెరిగితే.. వడ్డీ రేట్లు ?

ఆహార ధరల పెరుగుదల రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధానానికి కూడా సవాలుగా మారుతుంది. ద్రవ్యోల్బణం నిరంత రం పెరిగితే వడ్డీ రేట్లను పెంచే ఒత్తిడి ఏర్పడవచ్చు. అయితే వడ్డీ రేట్ల పెంపు ఒక్కటే ఆహార ధరలను తగ్గించగల పరిష్కారం కాదు. పంట దిగుబడులు, సరఫరా, నిల్వలు, రవాణా సమస్యలు ప్రధాన కారణాలైతే, వాటిని పరిష్కరించకుండా వడ్డీ రేట్ల ద్వారా మాత్రమే ధరల నియంత్రణ సాధించడం కష్టం. వడ్డీ రేట్లు పెరిగితే గృహ, వ్యాపార, వాహన రుణాలు తీసుకున్న కుటుంబాలపై అదనపు భారం పడ వచ్చు. చిన్న వ్యాపారాలకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకు సమన్వయంతో వ్యవహరించాలి. సరఫరా వైపు చర్యలు, మార్కెట్ జోక్యం, ద్రవ్య విధానం ఒకదానికొకటి తోడ్పడాలి.

తెలంగాణ రైతుల పరిస్థితేంటి?

తెలంగాణలో వ్యవసాయానికి వర్షా లు, చెరువులు, భూగర్భ జలాలు, సాగునీటి ప్రాజెక్టులు కీలకం. వర్షపాతం లోటు, చెరువుల నిల్వలు తగ్గడం, సాగు ఖర్చులు పెరగడం రైతుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపవచ్చు. ఆహార ధరలు పెరుగుతున్న సమయంలో రైతులకు సరైన మార్కెట్ ధర లభించకపోతే ద్వంద్వ సంక్షోభం ఏర్పడుతుంది. ఒకవైపు పంట సాగు ఖర్చులు పెరుగుతాయి. మరోవైపు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం పంటల వారీగా నీటి లభ్యతను అంచనా వేసి, వ్యవసాయ శాఖ ద్వారా తగిన సూచనలు ఇవ్వాలి. రైతులకు పంట బీమా, సాగునీటి ప్రణాళిక, మార్కెట్ సమాచారం, నిల్వ సదుపాయాలు అందుబాటులో ఉండాలి.

ధరల నియంత్రణే కాదు..!

ఆహార భద్రత అంటే కేవలం బియ్యం లేదా గోధుమలు అందించడం కాదు. పప్పులు, పాలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు వంటి పోషకాహారం ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండాలి. పేదరి కం, నిరుద్యోగం, తక్కువ వేతనాలు, ధరల పెరుగుదల కలిసి కుటుంబాల ఆహార వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వ పథకాల ద్వారా ఆహార ధాన్యాలు అందుతున్నప్పటికీ, పోషకాహార వైవిధ్యం పెం చేందుకు ప్రత్యేక చర్యలు అవసరం. పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం, అంగ న్వాడీ పోషకాహార కార్యక్రమాలు, ప్రజా పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలి. ధరలు పెరిగినప్పుడు అత్యంత ప్రభావితమయ్యే కుటుంబాలకు లక్ష్యిత సహాయం అందించాలి. పేద కుటుంబాల పిల్లలు ప్రోటీన్ ఆహారం నుంచి దూరం కాకుండా చూడాలి.

ప్రభుత్వానిదే బాధ్యత!

ఆహార ద్రవ్యోల్బణం అనేది గణాంకాల్లో కనిపించే శాతం మాత్రమే కాదు. అది ఒక తల్లి తన పిల్లలకు పాలు కొనగలదా లేదా అన్న ప్రశ్న. ఒక కార్మికుడు నెల జీతంతో కుటుంబానికి పోషకాహారం అందించగలడా అన్న ఆందోళన. ఒక రైతు పంట సాగు చేసి అప్పుల నుంచి బయటపడగలడా అన్న సంక్షోభం. ఒక వృద్ధుడు తన పెన్షన్తో మందులు, ఆహారం రెండింటినీ కొనగలడా అన్న జీవన సమస్య.

ఆర్థిక వృద్ధి గణాంకాలు ఎంత గొప్పగా ఉన్నా, సామాన్యుడి వంటగదిలో ధరల మంట ఆరనంతవరకు అభివృద్ధి సంపూర్ణం కాదు. రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి అందుబాటు ధర, పేద కుటుంబాలకు పోషకాహారం, మార్కెట్లో పారదర్శకత, ప్రభుత్వ నిల్వల సమర్థ వినియోగం.. ఇవన్నీ కలిసినప్పుడే ఆహార భద్రత సాధ్యమవుతుంది. ధరల పెరుగుదల ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు.. ప్రజల జీవన హక్కుపై పడుతున్న భారం! ఆకలి ముందు అభివృద్ధి గణాంకాలు చిన్నబోవాలి. సామాన్యుడి వంటగదిలో వెలుగు నింపడమే పాలనకు అసలైన ప్రమాణం!

ప్రభుత్వాల వద్ద నిల్వలున్నా.. 

ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా పప్పులు, ఉల్లిగడ్డ బఫర్ నిల్వలను నిర్వహిస్తోంది. అవసరమైనప్పుడు నిల్వల ను మార్కెట్లో విడుదల చేయడం, కొనుగోలు చేయడం, దిగుమతి.. ఎగుమతి విధానాలను సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపడుతోంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ 41 నిత్యా వసర వస్తువుల ధరలను 579 ధరల కేంద్రాల నుంచి సేకరిస్తున్నట్లు అధికారిక సమాచారం. ఈ చర్యలు ఉన్నప్ప టికీ ధరల పెరుగుదల కొనసాగితే, విధానాల అమలులో వేగం, నిల్వల పరిమాణం, మార్కెట్ జోక్యం సమయస్ఫూర్తి, ప్రాంతీయ సరఫరా వ్యవస్థల సామర్థ్యాన్ని సమీక్షించాల్సి ఉంటుంది. నిల్వలు ఉన్నాయని ప్రకటించడం మాత్రమే సరిపోదు.

అధిక ధరలతో బాధపడుతున్న ప్రాంతాలకు సరుకులు చేరుతున్నాయా? బఫర్ నిల్వల విడుదల వల్ల రిటైల్ ధరలు తగ్గుతున్నా యా? మధ్యవర్తుల అక్రమ నిల్వలు నియంత్రించబడుతున్నాయా? అనే ప్రశ్నలకు జవాబు అవసరం. ధరల నియంత్రణ చర్యలు కేవలం ఉల్లిగడ్డ, పప్పులకే పరిమితం కాకుండా పాలు, గుడ్లు, పశుగ్రాసం, కూరగాయలు, ఇతర పదార్థాల సరఫరాపైనా దృష్టి పెట్టాలి. రైతు ఉత్పత్తిదారుల సం ఘాలు, సహకార సంస్థలు, మార్కెట్లు, శీతల నిల్వ కేం ద్రాలు, రవాణా వ్యవస్థలను బలోపేతం చేయడం దీర్ఘకాలిక పరిష్కారానికి కీలకం.

వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, సెల్: 9010128884 

కాలగిరి శ్రీనివాస్‌రెడ్డి

మరిన్ని వార్తలు