చట్టాలు ఎంతమందికి తెలుసు?!
‘చట్టాల(Laws)పై అందరికీ అవగాహన అవసరం.. రాజకీయ నాయకులు(Politicians), పోలీసులు, న్యాయకోవిదులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు, కొనసాగిన వారు పదేపదే పలు వేదికలపై చెప్పిన, చెప్పే సుద్దులు. మరి.. ఆ చట్టాలు ఎంతమందికి తెలుసు? ఎన్ని చట్టాల గురించి తెలుసు? అనేది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సందేహమే! కోర్టులో వాదించే చట్టాలు, పోలీసు చట్టాలు ఒకటేనా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.
చట్టాలు గురించి తెలుసుకోవాలని చెప్పేవారే గానీ, వాటి గురించి బోధించే వారు ఎవరు? అనేది ప్రజల్లో ప్రశ్నగానే మిగిలిపోతోంది. తెలిసిన వారు చెప్పేది ఎంతమందికి? తెలుసుకోవడానికి ప్రయత్నించే వారు ఎంతమంది? అందుకు లెక్క లు లేవు! లెక్కించే వారు లేరు!! అక్టోబర్ 21 నుంచి 31 వరకు జరగనున్న పోలీస్ వారోత్సవాల నేపథ్యంలో చట్టాల అవగాహనపై ఆలోచిస్తే.. చట్టాలపై పరిజ్ఞానం ఎంతో చర్చించే అవకాశం దొరికింది.
ఆ మూడు చట్టాలు మినహా!
ఎంత లెక్కించినా ప్రస్తుత సమాజంలో మూడు చట్టాలపై మాత్రం అవగాహన ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు. పోక్సో, గృహహింస, అట్రాసిటీ యాక్ట్.. వీటికి సంబంధించిన కేసులే ప్రస్తుతం అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆ కాస్తనైనా ప్రజలకు తెలిసి ఉండొచ్చని అంచనా. ఢిల్లీ లో ఓ యువతిపై జరిగిన అఘాయిత్య సం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోక్సో యాక్ట్ రూపొందించబ డింది. అందువల్ల ఈ చట్టంపై కొంత అవగాహన వచ్చిందని భావించవచ్చు.
అలాగే గృహహింస చట్టం.. వివాహితులను హిం సిస్తే ఈ యాక్ట్ కింద కేసులు నమోదవుతాయనే అవగాహన ప్రజల్లో బలంగానే నాటుకుంది. ఇక అట్రాసిటీ యాక్ట్ కూడా బాగానే ప్రాచుర్యం పొందింది. ఇక ఇటీవల ఎక్కువ మంది బాధితులను తయా రు చేస్తున్న సైబర్ నేరాలకు సంబంధించిన చట్టాలపై కూడా కొంతమేరకు అవగా హన ఉందని చెప్పొచ్చు. మిగతా చట్టాలపై అవగాహన అంతంతమాత్రమేనని చెప్పడంలో సందేహం లేదు.
సినిమాలు, పెద్ద కోర్టుల పుణ్యమే!
ఇక కొన్ని సినిమాల్లో కోర్టు సన్నివేశాల ద్వారా కొన్ని చట్టాలు ప్రస్తావనకొచ్చినా అవి నిజమైన చట్టం పరిధిలోనివా? కాదా? అనే సందేహాలు లేకపోలేదు. ప్రస్తు త తమిళనాడు సీఎం విజయ్ నటించిన ఓ సినిమాలో ఓటు హక్కు చేసిన పోరాటం అందరికీ తెలిసే ఉంటుంది. ఆ చిత్రంలో విజయ్ ఓటును మరెవరో వేయడంతో అతను అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయిస్తారు. 49(పి) సెక్షన్ ప్రకారం తనకు ఓటు హక్కు కల్పించాలని, ఆ తర్వా తే ఓట్ల లెక్కింపు చేపట్టాలని వాదిస్తాడు. అయితే, ఈ విషయం బయటి ప్రపంచానికి కూడా ఇప్పటివరకు తెలియదు. 79 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలు జరిగాయి.
కానీ, ఎన్నికల చట్టంపై ఎన్నికల సంఘం కూడా ఏనాడూ బయటపెట్టలేదు. ఇంతకూ ఈ యాక్ట్ ఉందా? లేదా? అనే విషయాన్ని నేటికీ కూడా ఎన్నికల సంఘం ప్రకటించకపోవడం గమనార్హం. ఇలాంటి సెక్షన్లు ప్రజల కు తెలియనివి ఎన్నో సినిమాల్లో వినిపించినా.. ఒక చెవితో విన్నామా? మరో చెవి నుంచి వదిలేశామా? అనే కోవలోనే మనమంతా ఉన్నామని చెప్పొచ్చు. ఇక కొన్ని సెక్షన్ల గురించి అడపాదడపా ఉన్నత న్యా యస్థానాలు ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, వాటి గురించి తెలుసుకోవాలనే తపన లేకపోవడం ప్రజల అవగాహన రాహిత్యమని అనుకున్నా.. వాటిని అనుసరించగలమా? అనే అనుమానాలు.. చట్టాలపై పరిజ్ఞానానికి ప్రజలను దూరం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు.
వీళ్లు చెప్పరు.. వాళ్లూ చెప్పలేరు!
పోలీసులు, న్యాయవాదులను చట్టాలకు ప్రతినిధులుగా చెబుతుంటారు. కానీ, ఎవరూ చట్టాల గురించి పజ్రలకు చెప్పడానికి ముందుకురారు. కనీసం కేసుల్లో ఇరు క్కున్న వారికి కూడా ఆయా సెక్షన్లు, వాటి తీవ్రత, పరిణామాల గురించి చెప్పేవారు లేరని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఒకవేళ తెలుసుకోవడానికి ప్రయత్నించినా తెలుసుకుని ఏం చేస్తావనే ప్రశ్న తప్పు.. కచ్చిత మైన సమాధానం దొరకని పరిస్థితి. ఇక పోలీసుల విషయం చెప్పనలవి కాదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ సంగతి ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలనేది ప్రాథమిక నిబంధన.
కానీ, ఒక సామాన్యుడి విషయంలో ఈ నిబంధన అమలవుతున్నదా? పోలీసులే సమాధా నం చెప్పాలి. ఎలాంటి కేసులోనైనా నిందితుడిని అదుపులోకి తీసుకున్నాక 24గంట ల్లోగా కోర్టులో హాజరుపరచాలి. అలా జరుగుతున్నదా? కోర్టులో హాజరుపరిచే ముందు నిందితుడికి ఎఫ్ఎస్ఐఆర్ జిరా క్స్ కాపీ ఇవ్వాలి! అలా చేస్తున్నారా? వా హనాల తనిఖీలో సమయంలో వాహనాల కీ లాక్కోకూడదని పలు కోర్టులు, పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. క్షేత్రస్థాయిలో పోలీసులు కోర్టు ఉత్తర్వులను పాటిస్తున్నారా? అడగలేని ప్రశ్న దొరకలేని సమాధానంగానే మిగిలిపోతోంది.
టోల్ ఫ్రీ నంబర్లకే పరిమితమా?
చట్టాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని చెబుతున్న పాలకులు, పోలీసు లు కేవలం టోలీ నంబర్ల ప్రచారానికే పరిమితమవుతున్నట్లు స్పష్టమవుతోంది. రోడ్డు ప్రమాద సమయంలో 108, పోలీసుల రక్షణ అవసరమనుకుంటే 100 (ప్ర స్తుతం 112), చిన్నపిల్లల కోసం చైల్ లైన్ నంబర్ 1024 లాంటి వాటిపై పోస్ట ర్లు, ఇతరత్రా వేదికలపై చెప్పడం మినహా.. చట్టాలపై అవగాహన కల్పించే వారు లేరు. అవగాహన సదస్సులంటూ ఆర్భాటంగా నిర్వహించే సమావేశాల వేదికలపైనా టోలీ నంబర్ల గురించి తప్ప ఒక్కచట్టం గురించైనా చెప్పేవారు కనిపించరు.
ప్రశ్నిస్తే.. చంపేంత కోపమే!
సినిమాలు చూసో, లేదా కోర్టులు ప్రస్తావించాయనో పొరపాటున అలా ఎలా చేస్తారని పోలీసులను ప్రశ్నిస్తే అంతేసంగతులు. వాళ్లకు ఎక్కడ లేని కోప మొస్తుంది. శివాలెత్తిపోయి చివరకు హెూంగార్డులు కూడా నిందితులపై చేయి చేసుకోవడమో.. బండబూతులు తిట్టడమో చేస్తుంటారు.
రూల్స్ కావాల్నారా నీకు.. స్టేషన్కు నడువు.. అక్కడ చెబుతామంటూ హూంకరించడం పోలీసుల నైజంగా మారిందనడంలో ఆశ్చర్యం లేదు. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే ప్రశ్నించే వారిపై పోలీస్ మార్క్ ప్రదర్శనలు కోకొల్లలుగానే ఉంటాయి. ఇక సామాన్యులంటే మరింతగా రెచ్చిపోయి చుక్కలు చూపించే పోలీ సుల కరుకుతనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఏ కేసులోనైనా నేరారోపణ నిజమై తే గానీ కేసులో ఉన్న వ్యక్తులు దోషులు కారు. అప్పటివరకు వారు నిందితులే. కానీ.. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసిన క్షణం నుంచే నిందితులను దోషులుగా పరిగణించడం గమనార్హం.
పాఠశాల స్థాయి నుంచే..
చట్టాలపై అవగాహన పెంచుకోవడం అంటే పోలీసు అమరవీరు దినం సందర్భంగా సదస్సు నిర్వహించడం, టోల్ ఫ్రీ నంబర్ల గురించి చెప్పడం కాకుండా.. కొన్ని చట్టాలపైనైనా ప్రజలకు తెలియజేయాలి. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. భుజాలు జారిపో యేంత బరువు మోయిస్తున్న విద్యార్థుల్లో పుస్తకాల్లో చట్టం, రాజ్యాంగం గురించిన పాఠ్యాంశాలను చేర్చేందుకు పాలకులు, ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అందుకు ప్రత్యేక చట్టం రూపొందించి అయినా చట్టాలపై అవగాహన కల్పించేందుకు చొరవ చూపాలి.
మీడియా రంగం సైతం ఈ విషయంపై దృష్టి సారించాలి. గంటగంటకు ఘంటారావమ్.. పొలిటికల్ గేమ్ ప్రోగ్రాంల కంటే.. రోజుకొక్కటో, వారానికొక్కటో చట్టంపై ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలి. సమాజ శ్రేయ స్సుకు బాటలు వేయాల్సిన అవసరమే కాదు, బాధ్యతగా భావించాలి. కోర్టులు సైతం ఈ విషయంపై ప్రభుత్వాలకు, పోలీసులకు, మీడియాకు దిశానిర్దేశం చేయాలి. అలాగైనా ప్రజల్లో చట్టాలంటే గౌరవం, శిక్షలంటే భయం ఏర్పడుతుందేమో!
వ్యాసకర్త సెల్: 8143104050
గడుదాసు నమస్తే