పితృస్మరణ.. కృతజ్ఞతకు ప్రతిరూపం

10-10-2026 | 05:00am

(నేడు మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక కథనం)

భారతీయ సనాతన ధర్మ(Indian Sanatana Dharma) సంప్రదాయంలో పితృదేవతల ఆరాధనకు, పూర్వీకులను స్మరించుకోవడానికి విశిష్టమైన స్థానం ఉంది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జీవితానికి మార్గదర్శకులైన పెద్దలు, కుటుంబ అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన పూర్వీకుల సేవలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావిస్తారు. ఈ నేపథ్యం లో పితృపక్షాల ముగింపులో వచ్చే మహాలయ అమావాస్యకు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. దీనిని సర్వపిత అమావాస్య అని కూడా పిలుస్తారు.

పితృపక్ష కాలంలో తిథి తెలియని పూర్వీకులు నిర్వహించలేకపోయినవారికైనా ఈ రోజున తర్పణం, శ్రాద్ధం చేయ డం సంప్రదాయంగా వస్తోంది. హిందూ చాంద్రమాన సంప్రదాయం ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణపక్షాన్ని సాధారణంగా పితృపక్షంగా పరిగణిస్తారు. ఈ పక్షంలోని ౧౫ తిథులు పూర్వీకుల స్మరణకు అంకి తం చేయబడ్డాయి. పౌర్ణమి అనంతరం ప్రారంభమయ్యే ఈ పక్షంలో పూర్వీకులు మరణించిన తిథిని అనుసరించి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు.

పితృపక్షం చివరి రోజైన అమావాస్యను మహాలయ అమావాస్యగా వ్యవహరిస్తారు. పితృపక్షం అంటే కేవలం కొన్ని ఆచారాలను నిర్వహించే కాలం మాత్రమే కాదు. మన ఉనికికి కారణమైన పూర్వీకుల త్యాగాలను గుర్తు చేసుకునే సందర్భం కూడా.  

హిందూ పురాణాలు, ధర్మశాస్త్రాలు పితృదేవతల ఆరాధనను ప్రత్యేకంగా ప్రస్తావించాయి. మనుషులకు దేవరుణం, రుషిరుణం, పితృరుణం ఉన్నాయని సంప్రదాయ భావన. తల్లిదండ్రులను గౌరవించడం, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం, సంతానానికి మంచి విలువలు నేర్పడం పితృ రుణాన్ని తీర్చుకునే మార్గాలుగా భావిస్తారు. మహాభారతంలోని అనుశాసన పర్వంలో దానం, ధర్మం, పితృకర్మల ప్రాధాన్యత గురించి వివరణలు కనిపిస్తాయి.

అలాగే గరుడ పురాణం, వివిధ ధర్మశాస్త్ర సంప్రదాయాల్లో మరణించినవారి కోసం శ్రాద్ధం, తర్పణం నిర్వహించే విధానాలు ప్రస్తావించబడ్డాయి. మహాభారతంలోని కర్ణుడికి సంబంధించిన ప్రసిద్ధ కథ పితృపక్ష ఆచారాల వెనుక ఉన్న భావనను వివరిస్తుంది. కర్ణుడు మరణానంతరం పితృలోకానికి వెళ్లినప్పుడు అతనికి బంగారం,ఆభరణాలు లభించాయని, ఆహారం లభించలేదని కథ చెబుతుంది.

జీవితంలో అతడు విస్తారంగా దానధర్మాలు చేసినప్పటికీ, పూర్వీకుల పేరిట అన్నదానం చేయలేదని తెలుసుకుంటాడు. అనంతరం భూమిపైకి తిరిగి వచ్చి పితృదేవతల పేరిట దానధర్మాలు చేయడానికి అవకాశం లభించిందని ఒక పురాణ సంప్రదాయం వివరిస్తుంది. ఈ కథలోని ప్రధాన సందేశం.. సంపదను కూడబెట్టడం మాత్రమే కాదు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, పూర్వీకులను స్మరించడం, దానం చేయడం ధర్మంలో భాగమని. 

ఉదయాన్నే స్నానాలు.. పూర్వీకులకు తర్పణాలు: 

మహాలయ అమావాస్య రోజున భక్తులు తమ కుటుంబ సభ్యులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, శుచిగా పితృకర్మలకు సిద్ధమవుతారు. నదులు, పవిత్ర జలాశయాల వద్ద స్నానం చేయడం కొన్ని ప్రాం తాల్లో ఆచారంగా ఉంది. అయితే ఇంటి వద్ద స్నానం చేసి కూడా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించవచ్చు.మొత్తంగా మనకు జీవితాన్ని అందించిన పూర్వీకులను స్మరించుకుంటూ, జీవించి ఉన్న పెద్దలను గౌరవిస్తూ, సమాజంలోని నిరుపేదలకు అండగా నిలిచినప్పుడే ఈ పర్వదినం యొక్క అంతరార్థం సార్థకమవుతుంది. 

వ్యాసకర్త సెల్: 8686051752 

మరిన్ని వార్తలు