పార్ట్ టైం అధ్యాపకుల గోడు!

01-11-2026 | 05:10am

కొందరి ఆవేదన, ఆక్రందన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది. ఉన్నత చదువులు చదివినా తగిన అవకాశాలు లేక, చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారమై, పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వలేకపోతున్నామనే బాధను గుండెల్లోనే అణచుకుంటున్నారు.

కన్నీరు కూడా బయటకు రాకుండా విశ్వవిద్యాలయాల్లో(Universities) పార్ట్ టైం అధ్యాపకులుగా బతుకు పోరా టం సాగిస్తున్న వీరిని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం నిజంగా అమానవీయం. రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో 429 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తూ 142 జీవోను, నియామక మార్గదర్శకాలను తెలుపుతూ జీవో నంబర్ 31ను విడుదల చేసింది.

ఈ నిర్ణయం సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల భవిష్యత్తును తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో 715 మందికి పైగా అధ్యాపకులు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వారి ప్రయోజనాలను పక్కన బెట్టి, ఉద్యోగ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా నూతన నియామకాలకు తెరలేపడం వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అనంతరం విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిశోధనా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అధ్యాపక నియామకాలు చేపట్టాలనే డిమాండ్ పౌర సమాజం నుంచి వినిపిస్తోంది.

అయితే విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పెంచటం అంటే ఉద్యోగాల భర్తీ మాత్రమే కాదు!, చాలీచాలని వేతనంతో నెట్టుకొస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల(Part Time Lecturers) సమస్యలను పరిష్కరించటం, వారికి అన్యా యం జరగకుండా చూడటం ప్రభుత్వాల కర్తవ్యం. కానీ, అవేమీ పట్టించుకోకుండా అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ల సమస్యలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.   

దశాబ్దకాలంగా అర్ధాకలి బతుకులు

విశ్వవిద్యాలయాల్లో పార్ట్ టైం అధ్యాపకుల బతుకులు అగమ్యగోచరంగా మారా యి. వీరికి విద్యా సంవత్సరంలో 180 రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తారు. బోధనతో పాటు పరీక్షల నిర్వహణ, మూ ల్యాంకనం,  ప్రయోగశాలల నిర్వహణ, హాస్టళ్ల నిర్వహణలో వారి సేవలను వినియోగించుకుంటూ ఏడాదిలో ఆరు నెల లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తుండటంతో అర్ధాకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. వెట్టి చాకిరి చేసే ఒక బాండెడ్ లేబర్‌గా పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలు మారినా ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపోలేదు.

కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి వారి సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. సేవలు అందించేందుకు అక్కరకు వచ్చే పార్ట్ టైం ఉద్యోగులు.. పదోన్నతులకు పనికిరారా? అనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఇంతటి దయనీయమైన విధానం ఏ ప్రభుత్వ శాఖలోనూ లేదనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గమనించాల్సిన అవసరం ఉంది.

స్వరాష్ట్రంలోనే వెట్టి!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలు అగాధంలోకి నెట్టబడ్డాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో పార్ట్ టైం అధ్యాపకులకు ప్రభుత్వ అనుమతి లేకుండా విశ్వవిద్యాలయాలే కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పదోన్నతి కల్పించేవి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన అనంతరం కొలువుదీరిన మొదటి ప్రభుత్వం ముంద స్తు అనుమతి లేకుండా విశ్వవిద్యాలయాల్లో కొత్త నియామకాలు చేపట్టరాదని 2014లో సర్క్యులర్ విడుదల చేసింది.

దీన్ని అడ్డం పెట్టుకొని పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్ట్ లెక్చరర్లుగా కన్వర్షన్ చేసే పద్ధతికి విశ్వవిద్యాలయాలు స్వస్తి పలికాయి. దశాబ్దాబానికి పైగా వారితో వెట్టి చాకిరి చేయిస్తుండటంతో ఉన్నత విద్యావంతులను పరిస్థితి అడ్డా కూలీల కంటే దయనీయంగా తయారైంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సర్క్యుల ర్‌తో ఎదురవుతున్న సమస్యలను  పార్ట్ టైం అధ్యాపకులు అనేక సందర్భాల్లో, వివిధ రూపాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.

అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ జీవితాల్లో దశాబ్ద కాలంగా చీకటి అలుముకుందని పార్ట్‌టైం అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్రాఉ. 2023లో ఎన్నికలకు ముందు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకు లను క్రమబద్ధీకరించిన నాటి ప్రభుత్వం.. విశ్వవిద్యాలయాల్లోని పార్ట్ టైం అధ్యాపకులను కనీసం కాంట్రాక్ట్  విధానంలోకి అప్‌గ్రేడ్ చేయకపోవడం వల్ల వందలాది నాటి ప్రభుత్వ బాధితులుగా మిగిలిపోయారు.

మాట తప్పిన ప్రభుత్వం

గత ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ వల్ల పార్ట్‌టైం అధ్యాపకుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడగా, ప్రస్తుత సర్కా ర్ సైతం నమ్మించి తమ గొంతు కోసిందని వారు వాపోతున్నారెఉ. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాపకులకు నెలకు కనీసం రూ.50 వేల వేతనం ఇస్తామనే హామీని మేనిఫెస్టోలో పొందుపరిచింది.

కానీ, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు కావస్తుండటమే కాకుండా, విద్యాశాఖకు తానే మంత్రిగా ఉన్నప్పటికీ హామీని అమలు చేయకుండా మోసం చేశారన్నది పార్ట్ టైం ఉద్యోగుల ఆరోపణ. ఇంకా విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపరిచిన ప్రొఫెసర్‌కు రాష్ర్టంలో ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌గా అవకాశం లభించింది.

‘ఇది ప్రజాప్రభుత్వం, మాది ప్రజా పాలన’ అని చెబుతారే కానీ, నేతల చేతలు గడప కూడా దాటవని ముఖ్యమంత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భం లోనే రుజువైంది. ముఖ్యమంత్రి కనీసం  పార్ట్ టైం అధ్యాపకుల బాధలు వినటానికి కూడా ముందుకు రాకపోవడం వారికి తీవ్ర ఆవేదన కలిగించింది. గత బీఆర్‌ఎస్  ప్రభుత్వం పార్ట్ టైం అధ్యాపకులకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా 2017లో రూ.375 ఉన్న పీరియడ్ రెమ్యునరేషన్‌ను రూ.450కు పెంచింది. 2018లో రూ.700కు పెంచి కొంత వరకు ఆర్థికంగా అండగా నలిచింది.

దక్కని కనీస గౌరవం

ప్రజాప్రభుత్వాలు బాధితుల సమస్యలను ఆలకించి, అధ్యయనం చేసి పరిష్కా రం చూపెడతాయి. కానీ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం అధ్యాప కులు తమ సమస్యలను అధికారులకు, ప్రభుత్వపెద్దలకు ఎన్నిసార్లు విన్నవించినా ఉన్నత విద్యావంతులు, బాధితులు అనే సానుభూతి కూడా లేకుండా అవమానించటం ప్రజాపాలన ఎలా అవుతుంది?. ఈ ప్రభుత్వ మౌలిక సూత్రానికి భిన్నంగా పనిచేస్తున్న వారు ప్రభుత్వ ప్రతిష్ఠను ఎలా కాపాడుతారు?. పార్ట్ టైం అంటే పార్ట్ టైమే!.. ఎన్ని యుగాలైనా మీరు అలానే చావాలనే ధోరణిలో అధికారులు, ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కన్వర్షన్ చేస్తామని నాటి పీసీసీ అధ్యక్షుని హోదాలో కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకే దిక్కు లేకపోతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా నూతన నియామకాలు చేపట్టటం అంటే ప్రభుత్వం ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేకంగా, రాజ్యాంగ, న్యాయ సూత్రాలకి  భిన్నంగా నిర్ణయం తీసుకుంటున్నట్లుగానే భావించాలి.

 పార్ట్ టైం అధ్యాపకుల సంఘం సలహాదారులు 9885465877

డాక్టర్ తిరునహరి శేషు

మరిన్ని వార్తలు