అమిత్ షా రాక రేపే
- హైదరాబాద్‌లో బీజేపీ మహాపాదయాత్రకు హాజరు
- పార్టీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
- యాత్ర ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌పై సన్నాహక సమావేశం
- విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
- 5న కరీంనగర్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): నవంబర్ 2న బీజేపీ మహా పాదయాత్రను హైదరాబాద్‌లో చేపట్టనుంది. ఈ పాదయాత్రకు ముఖ్య అతి థిగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) హాజరుకానున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ చౌరస్తా వరకు జరిగే పాదయాత్రలో షా పాల్గొననున్నారు. అనంతరం నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు.
ఈ పాదయాత్రకు సంబంధించిన సన్నాహాక సమావేశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభం కానున్న నిజాం కాలేజీ వద్ద ప్రాంతాన్ని వారు పరిశీలించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం, కార్యక్రమ నిర్వహణ, సమన్వయం తదితర కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. కాసం వెంకటేశ్వర్లు, బండారు శాంతికుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మరికొందరు నాయకులు పాల్గొన్నారు.
5న కరీంనగర్‌కు నితిన్ నబీన్..
ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్నారు. కరీంనగర్‌లో జరిగే పాదయాత్రకు హాజరుకానున్నారు. పాదయాత్రకు భారీ జనసమీకరణకు కేంద్రమంత్రి బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా పాదయాత్రను చేపట్టనున్నారు.ఆ వివరాలను ఆయన త్వరలోనే వెళ్లడించనున్నారు. ఇప్పటికే ఈ పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడింది.