వీళ్లేం పోలీసులు?
- మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో రికవరీ సొత్తు కాజేసిన కానిస్టేబుల్
- సీజ్ చేసిన ఫోన్ నుంచి రూ.1.70 లక్షలు బదిలీ
- మరోవైపు పటాన్‌చెరు ఠాణా నుంచి నిందితుల పరారీ!
- రూ.23 లక్షల విలువైన సరుకు మాయం కేసులో కలకలం
- రెండు ఘటనల్లోనూ పోలీసుల గోప్యత
రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఓ చోట భక్షక భటులుగా మారారు. మరో చోట అరెస్టు చేసి స్టేషన్‌లో ఉంచిన నిందితులు అక్కడి నుంచి పరారైనా గుర్తించని స్థితిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్(Meerpet Police Station)లో సీజ్ చేసిన నగదు, బంగారు ఆభరణాలను కానిస్టేబుల్ తన సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేసిన ఘటన ఆలస్యంగా బయట పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో గోడౌన్‌కు తీసుకెళ్లాల్సిన రూ.23 లక్షల విలువైన వస్తువులను మాయం చేసిన ట్రక్ డ్రైవర్, క్లీనర్‌లను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కానీ నిందితులిద్దరూ పోలీసుల కళ్లుగప్పి స్టేషన్ నుంచి పరారయ్యారు.
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా శ్రవణ్ కుమార్ పని చేస్తున్నాడు. ఒక కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ ద్వారా ఏకంగా రూ.1.70 లక్షలు తన బంధువుల ఖాతాలకు అక్రమంగా బదిలీ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా, అదే కేసులో దొంగల నుంచి రికవరీ చేసి స్టేషన్‌లో భద్రపరిచిన సుమారు 12 తులాల బంగారు ఆభరణాలను సైతం మాయం చేశాడు. ఆ బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి సుమారు రూ.12,37,000 నగదు పొందినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతుండటంతో చికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, ఆ పరిస్థితుల్లోనే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. అయితే, ఈ చికిత్స పొందుతూనే ఇటీవలే ఆయన తండ్రి మరణించినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ తంతు జరగడంతో ఈ వార్త బయటకు రాకుండా అధికారులు మొదట్లో చాలా జాగ్రత్త పడినట్లు ప్రచారం జరిగింది. అయితే విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
పోలీస్ స్టేషన్ నుంచి నిందితుల పరార్!
గుర్గావ్ నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం వెలిమలలోని గోడౌన్‌కు సరుకు రవాణా చేస్తున్న ట్రక్ డ్రైవర్, క్లీనర్ కలిసి సుమారు రూ.23 లక్షల విలువైన వస్తువులను మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సంస్థ ప్రతినిధులు ఇద్దరినీ పట్టుకుని పటాన్‌చెరు పోలీసులకు అప్పగించగా, వారిద్దరూ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు ఇద్దరూ ఎలా బయటకు వెళ్లగలిగారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఘటన పోలీస్ స్టేషన్ భద్రతా ఏర్పాట్లపై కూడా అనుమానాలు రేకెత్తిస్తోంది. నిందితులు స్టేషన్ నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులు కొంత ఆలస్యంగా గుర్తించినట్లు సమాచారం. అనంతరం చేపట్టిన చర్యల్లో ట్రక్ డ్రైవర్‌ను తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న క్లీనర్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనను బయటకు రానీయకుండా పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.