మిల్లర్లపై సీబీ సీఐడీ నజర్!

01-11-2026 | 05:15am
  1. కొరడా ఝళిపిస్తున్న ప్రభుత్వం
  2. అరెస్టుతో బెంబేలెత్తుతున్న మిల్లర్లు 
  3. సీఎంఆర్ ధాన్యాన్ని దిగమింగిన వారిలో గుబులు

మహబూబాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): ప్రభుత్వం సీఎంఆర్ పథకం(CMR Scheme) ద్వారా అప్పగించిన ధాన్యాన్ని దిగమింగి, అక్రమ మార్గంలో పయనించిన రైస్ మిల్లర్ల(Rice Millers)పై ప్రభుత్వం సీబీసీ‘ఐ’డీ అస్త్రాన్ని కూడా ప్రయోగించడంతో తప్పుడు మార్గంలో పయనించిన మిల్లర్లు బెంబేలెత్తిపోతున్నారు. గత పది ఏళ్ల కాలంగా ప్రభుత్వం ద్వారా సీఎంఆర్ పథకం అమలు చేయడానికి వేల టన్నుల ధాన్యాన్ని తీసుకొని అందుకు బదులుగా ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా, దొడ్డి దారిలో ధాన్యాన్ని పూర్తిగా అమ్ముకొని ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టి దర్జా వోలకబోస్తున్న కొందరు రైస్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొరడా ఝళిపించింది.

సీఎంఆర్ పథకంలో ధాన్యం తీసుకుని సకాలంలో బియ్యం పెట్టని కొందరి మిల్లర్లను డిఫాల్ట్‌గా ప్రకటించి పోలీసు కేసులు నమోదు చేయడంతో పాటు అనేక పర్యాయాలు నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ తమ రాజకీయ పలుకుబడి ద్వారా ఇంతకాలం నెట్టుకొచ్చారు. మరికొంతమంది సీఎంఆర్ పథకంలో ధాన్యం తీసుకొని బియ్యం పెట్టకుండా పాడైపోయిందని చెప్పడంతో, ప్రభుత్వం టెండర్ నిర్వహించగా, సకాలంలో ధాన్యాన్ని చూపించకపోవడంతో కొందరు మిల్లర్లను టెండర్ ప్యాడి ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చింది.

డిఫాల్టర్లు, టెండర్ ప్యాడి మిల్లర్లకు అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ మొండికేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సివిల్ సప్లై శాఖ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను నియమించి ప్రత్యేకంగా మిషన్ కే 100 కార్యక్రమాన్ని నిర్వహించింది. వంద రోజులపాటు మిషన్ కే 100 కార్యక్రమంలో ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ, సీఎంఆర్ ధాన్యం వ్యవహారంలో మరో కొత్త కోణం బయటకు పడింది.

భారత ఆహార సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సన్న బియ్యం పెట్టాల్సిన మిల్లర్లు కొందరు అందుకు బదులుగా దొడ్డు బియ్యం పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన కమిషన్ రాకుండా చేయడంతో పాటు, సన్నధాన్యాన్ని దిగమింగి తక్కువ ధరకు దొడ్డు బియ్యం ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకొని మిల్లు పట్టకుండానే బియ్యం పెట్టారని గుర్తించిన ప్రభుత్వం ఇటీవల సీబీసీఐడీనీ కూడా రంగంలోకి దింపింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు సీబీ సీఐడీ అధికారులు దూకుడుగా వ్యవహరించి సన్న బియ్యానికి బదులు దొడ్డు బియ్యం పెట్టిన 14 మంది రైస్ మిల్లర్లను అరెస్టు చేసి సంచలనం సృష్టించారు.

దీనికి తోడు అక్రమాలకు పాల్పడుతున్న కొందరు రైస్ మిల్లర్లకు అండగా నిలుస్తున్న నేతలు, అధికారులు, ఇతర వర్గాలకు చెందిన వారిపై కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కాట్రగడ్డ సతీష్ కుమార్‌ను కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే  అధికారులు అరెస్టు చేయడం గమనార్హం. అరెస్ట్ అయిన సదరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సీబీ సీఐడీ అధికారుల తనిఖీల విషయాన్ని ప్రస్తావిస్తూ ‘రైస్ మిల్లర్ల వాట్సాప్ గ్రూపు’లో ‘అలర్ట్’ చేయడం కారణంగా భావిస్తున్నారు. 

ధాన్యం ఏం చేశారు?

రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ పథకంలో రైస్ మిల్లర్లకు కేటాయించిన దాన్యంలో కొందరు మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా ఏం చేశారనే విషయాన్ని ఇప్పుడు సీబీసీఐడీ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చాలాకాలంగా కొందరు రైస్ మిల్లర్లు సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించి వచ్చిన కోట్ల రూపాయలను ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారని, ఆస్తులు, బినామీల వివరాలను ఇప్పటికే సేకరించారని, ఆ విధంగా బకాయి పడ్డ ధాన్యానికి సంబంధించిన డబ్బులను రికవరీ చేయడానికి సీబీసీఐడీ అధికారులు చర్యలకు పూనుకున్నట్లు చెబుతున్నారు. 

మరోవైపు నూతనంగా సివిల్ సప్లై శాఖ ప్రవేశపెట్టిన యాప్ ద్వారా గడిచిన రెండు సీజన్లకు సంబంధించిన దాన్యం కేటాయింపు, సీఎంఆర్ పథకంలో రైస్ మిల్లర్లు చెల్లించాల్సిన బియ్యం బకాయిలు, మిల్లులో ఉన్న స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు ఫీల్ వెరిఫికేషన్ చేయడానికి ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు.  ప్రతి జిల్లాలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో సివిల్ సప్లై శాఖ జిల్లా మేనేజర్, జిల్లా సప్లై అధికారి, సివిల్ సప్లై ఉపతహసిల్దార్ నేతృత్వంలో క్షేత్రస్థాయి తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ఓవైపు మిషన్ కే 100, ఇంకోవైపు సీబీసీఐడ, మరోవైపు సివిల్ సప్లై శాఖ అధికారుల తనిఖీలతో డిఫాల్ట్, టెండర్ ప్యాడి బకాయి పడ్డ మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

మరిన్ని వార్తలు