ఎమర్జెన్సీ చీకట్లు.. సోనియా ఆత్మకథలో

11-11-2026 | 12:55pm

దేశ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టాలైన ఎమర్జెన్సీ (1975–77), ఆపరేషన్‌ బ్లూస్టార్‌ (1984) గురించి సోనియా గాంధీ తన ఆత్మకథలో పలు విషయాలను వెల్లడించినట్లు కథనాలు వెలువడ్డాయి. అప్పటి రాజకీయ పరిణామాలు, ఇందిరా గాంధీ ఎదుర్కొన్న ఒత్తిళ్లు, సంజయ్‌ గాంధీ వ్యవహారశైలి, కుటుంబంలో చోటుచేసుకున్న విభేదాలను ఆమె గుర్తుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ విధింపు విషయంలో ఇందిరా గాంధీ పూర్తిగా సంతృప్తిగా లేరని, పరిస్థితుల ఒత్తిడితోనే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సోనియా వివరించినట్లు సమాచారం.

ఎమర్జెన్సీ సమయంలో సంజయ్‌ గాంధీ వ్యవహరించిన తీరుపై సోనియా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆయన తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారని అభివర్ణించారు. ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేకపోయినా ప్రభుత్వ నిర్ణయాలపై సంజయ్‌ గణనీయమైన ప్రభావం చూపారని ఆమె పేర్కొన్నట్లు కథనం.

సంజయ్‌ ప్రవేశపెట్టిన ఐదు సూత్రాల కార్యక్రమంలో భాగంగా కుటుంబ నియంత్రణ, మురికివాడల తొలగింపు వంటి చర్యలు చేపట్టారు. అయితే బలవంతపు కుటుంబ నియంత్రణ (Forced Sterilization), ఢిల్లీలో మురికివాడల తొలగింపు (Slum Clearance) కార్యక్రమాల అమలు తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామాలు ఇందిరా గాంధీ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చాయని సోనియా తన రచనలో వివరించినట్లు తెలుస్తోంది.

ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ రాజకీయంగా ఒంటరితనాన్ని, తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారని సోనియా గుర్తుచేసుకున్నట్లు కథనాలు చెబుతున్నాయి. సంజయ్‌ దూకుడు స్వభావం కారణంగా కుటుంబంలోనూ విభేదాలు తలెత్తాయని, ఆ సమయంలో రాజీవ్‌ గాంధీ తన తల్లికి అండగా నిలిచేవారని వివరించారు. ఆమెను ఓదారుస్తూ పరిస్థితులకు తగిన సలహాలు ఇచ్చేవారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పత్రికలపై ఆంక్షలు, రాజకీయ ప్రత్యర్థుల అరెస్టులు, పౌర హక్కులపై పరిమితులతో ఎమర్జెన్సీ పరిస్థితులు తీవ్రంగా మారాయి. 1976 క్రిస్మస్‌ తర్వాత దేశాన్ని ఈ సంక్షోభం నుంచి బయటపడేయాలని ఇందిరా గాంధీ భావించినట్లు సోనియా రాసినట్లు తెలుస్తోంది.

ఎమర్జెన్సీని కొనసాగించాలా? ఎత్తివేయాలా? అనే అంశంపై కాంగ్రెస్‌ కుటుంబంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సోనియా వెల్లడించినట్లు కథనం. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ఎన్నికలు నిర్వహించాలని రాజీవ్‌ గాంధీ సూచించగా, అప్పుడే ఎమర్జెన్సీని ఎత్తివేయకూడదని సంజయ్‌ గాంధీ పట్టుబట్టినట్లు ఆమె వివరించారు.

చివరకు ఇందిరా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 1977 జనవరి 18న రాజకీయ ఖైదీల విడుదలతో పాటు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలవడంతో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

1984లో జరిగిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌ (Operation Blue Star) అనంతర పరిణామాలు ఇందిరా గాంధీని తీవ్రంగా కలచివేశాయని సోనియా తన ఆత్మకథలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అప్పట్లో పంజాబ్‌లో జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే నాయకత్వంలో సాయుధ వేర్పాటువాద ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో సాయుధులు మకాం వేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో వారిని బయటకు పంపేందుకు భారత సైన్యం 1984 జూన్‌లో సైనిక చర్య చేపట్టింది.

ఈ చర్యలో స్వర్ణ దేవాలయ సముదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. భారీగా ప్రాణనష్టం సంభవించింది. సిక్కుల అత్యంత పవిత్రమైన ప్రార్థనా స్థలంలో సైనిక చర్య జరగడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.ఆపరేషన్‌ ముగిసిన వారం రోజుల తర్వాత నిఘా వర్గాలు అందించిన దృశ్యాలను ఇందిరా గాంధీ వీక్షించారని సోనియా గుర్తుచేసుకున్నట్లు కథనం. ఆ వీడియో దృశ్యాల్లో నేలపై పడి ఉన్న మృతదేహాలు, భింద్రన్‌వాలే మృతదేహం, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు కనిపించాయని ఆమె వివరించినట్లు తెలుస్తోంది.

ఆ దృశ్యాలను చూస్తున్న సమయంలో ఇందిరా గాంధీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని, ఆమె ముఖం కన్నీళ్లతో తడిసిపోయిందని సోనియా తన ఆత్మకథలో రాసినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.


మరిన్ని వార్తలు