ఉచిత మెగా వైద్య శిబిరం

11-11-2026 | 12:27pm

పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంతో జరుపుకోవడం అభినందనీయం

కొలనుపాకలో వైద్య శిబిరం నిర్వహించిన దూడల సాగర్ – అంభిక దంపతులు

ఆలేరు,(విజయక్రాంతి): పుట్టినరోజు వేడుకలను కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య జరుపుకోవడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని కొలనుపాక గ్రామస్తులు కొనియాడారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన దూడల సాగర్, అంభిక దంపతుల ఏకైక కుమార్తె చిన్నారి గ్రీష్మ తొలి పుట్టినరోజు సందర్భంగా బుధవారం మెడిసిటీ హాస్పిటల్స్ వైద్య బృందం సహకారంతో గ్రామంలోని రైతు వేదిక వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న రాథోడ్ మాట్లాడుతూ.. ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మేలు చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు కూడా సహకారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాధారణంగా పిల్లల తొలి పుట్టినరోజును కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా నిర్వహిస్తారని, అందుకు భిన్నంగా గ్రామ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

దూడల సాగర్, అంభిక దంపతులు గ్రామానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. చిన్నారి గ్రీష్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యకమ్మ, గాదె సోమిరెడ్డి, వార్డు సభ్యులు బొంకూరి మల్లయ్య, మల్గ సత్తయ్య, చిరబోయిన రమేష్, మామిడాల అశోక్, బైరి విశ్వనాథం, బాలనర్సయ్య, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు