కాంగ్రెస్‌లో అసమ్మతి అగ్గి.. అధిష్ఠానం యాక్షన్‌కు సిద్ధమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ సాగిన అసమ్మతి రాజకీయాలకు బ్రేక్ పడనుందా? సొంత ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తున్న నేతలకు పార్టీ అధిష్ఠానం కళ్లెం వేయనుందా? గాంధీభవన్‌లో మొదలైన క్రమశిక్షణ కసరత్తు ఢిల్లీకి చేరడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య వివాదంతో మొదలైన వ్యవహారం.. ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరకు చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య ఢిల్లీలో జరిగిన వాగ్వాదం (Political Dispute) తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది. ఇద్దరు నేతల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. వివరణ ఇచ్చేందుకు గాంధీభవన్‌కు రావాలని ఇద్దరినీ ఆహ్వానించారు. అయితే గురువారం జరగాల్సిన సమావేశానికి ఇద్దరూ హాజరుకాకపోవడంతో పీసీసీ నాయకత్వం అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై పూర్తి వివరాలతో అధిష్ఠానానికి నివేదిక పంపే అంశం తెరపైకి వచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో దామోదర, లక్ష్మీకాంతారావు వివాదమే కాకుండా పలువురు నేతల మధ్య నెలకొన్న విభేదాలు కూడా పార్టీ పెద్దల దృష్టికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు, వివిధ ప్రాంతాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు, పెద్దపల్లి రాజకీయ పరిణామాలతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొంది.
ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి తరచూ చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు ఇప్పటికే పార్టీలో చర్చకు దారితీశాయి. మంత్రి పదవి విషయంలో తన అసంతృప్తిని పలుమార్లు వ్యక్తం చేయడం, ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు గుప్పించడం పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు ఆయన వ్యాఖ్యలపై కఠిన చర్యలు కనిపించకపోయినా.. ప్రస్తుతం పీసీసీ స్థాయిలో వివిధ వివాదాలపై నివేదికలు సిద్ధమవుతుండటంతో రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. హైకమాండ్ ఆయన వ్యాఖ్యలను ఎలా పరిగణనలోకి తీసుకుంటుంది? వివరణ కోరుతుందా? షోకాజ్ నోటీసు (Show Cause Notice) జారీ చేస్తుందా? లేక క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీ పిలిస్తే నేతలు హాజరుకావాలి.. పార్టీ వేదికలపైనే తమ అభిప్రాయాలు వెల్లడించాలి.. ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేస్తే నాయకత్వం స్పందించాలనే క్రమశిక్షణా ప్రమాణాలను అమలు చేయాలనే దిశగా పీసీసీ అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే పలు వివాదాలు హైకమాండ్ దృష్టికి చేరడంతో పార్టీ పెద్దలు ఒక్కొక్క అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది.
మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పటివరకు సాగిన అసమ్మతి రాజకీయాలు ఇప్పుడు క్రమశిక్షణ పరీక్షగా మారాయి. దామోదర-లక్ష్మీకాంతారావు వివాదం, అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వంటి అంశాలు ఢిల్లీ పెద్దల ముందుకు చేరుతున్నాయి. మరి హైకమాండ్ హెచ్చరికలతో సరిపెడుతుందా? లేక కొందరు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? రాజగోపాల్ రెడ్డి విషయంలోనూ కీలక నిర్ణయం ఉంటుందా? అన్నది వేచి చూడాలి.