బాల్ ట్యాంపరింగ్‌పై ఖవాజా సంచలన ఆరోపణలు

07-11-2026 | 11:19am

ఎనిమిదేళ్ల తర్వాత అసలు నిజం బయటపెట్టిన క్రికెటర్!

ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్(Steve Smith David Warner Ball Tampering) వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో వెలుగుచూసిన Sandpaper Gate ఘటనపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) సంచలన వ్యాఖ్యలు చేశారు. బంతిని దెబ్బతీసేందుకు శాండ్‌పేపర్ ఉపయోగిస్తున్న విషయం ఆస్ట్రేలియా జట్టులోని అందరికీ తెలుసని బాంబు పేల్చారు. ఈ వ్యవహారంలో కొందరినే బాధ్యులుగా చూపించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

'జట్టులో అందరికీ తెలుసు'.. ఖవాజా సంచలన ఆరోపణలు

తన ఆత్మకథ 'Sabr'లో ఈ వివాదానికి సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించనున్నట్లు ఖవాజా తెలిపారు. పుస్తకం విడుదలకు ముందే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ఘటనలో బ్యాటర్లు, బౌలర్లు, సహాయక సిబ్బంది అంటూ ఎలాంటి తేడా లేదని, టీమ్ మొత్తానికి విషయం తెలుసని పేర్కొన్నారు. ఆదర్శవంతమైన పరిస్థితుల్లో తాను ఈ విషయాల గురించి బయటకు మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదని, కానీ ఎనిమిదేళ్లు గడిచినా అసలు నిజం బయటకు రాకపోవడంతో మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు. అంతేకాదు, కేప్‌టౌన్ టెస్టుకు ముందు జరిగిన మరో మ్యాచ్‌లోనూ బంతిపై ఇదే తరహా చర్యలు జరిగాయని తన పుస్తకంలో ప్రస్తావించనున్నట్లు వెల్లడించారు.

స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లకే శిక్షలు

2018లో వెలుగులోకి వచ్చిన ఈ Ball Tampering Scandal అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఈ ఘటనలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. ఈ వివాదంపై Cricket Australia కఠిన చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా.. బాన్‌క్రాఫ్ట్‌కు తొమ్మిది నెలల నిషేధం పడింది. స్మిత్ రెండేళ్లపాటు కెప్టెన్సీకి దూరమయ్యాడు. వార్నర్‌పై విధించిన జీవితకాల Leadership Banను 2024లో ఎత్తివేశారు.

'ఆ ముగ్గురినీ ఒంటరిని చేశారు'

ఈ ఘటనలో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లను మాత్రమే తీవ్రంగా విమర్శించడం తనను బాధించిందని ఖవాజా అన్నారు. ఈ వ్యవహారాన్ని జట్టు మొత్తానికి సంబంధించిన అంశంగా చూడాలని అప్పుడే చెప్పినట్లు వెల్లడించారు. ముఖ్యంగా వార్నర్ గత ఎనిమిదేళ్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారని, బాన్‌క్రాఫ్ట్ కూడా మంచి ప్రదర్శనలు చేసినప్పటికీ ఈ వివాదం నీడ నుంచి బయటపడలేకపోయారని పేర్కొన్నారు. స్మిత్ కూడా ఆ ఘటన తర్వాత మళ్లీ అత్యుత్తమ స్థాయికి చేరుకున్నప్పటికీ ఆ చేదు అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేడని వ్యాఖ్యానించారు.

విచారణ కోసం తనను పిలవలేదన్న ఖవాజా

ఈ వివాదం జరిగిన టెస్టు మ్యాచ్ మొత్తం తాను బాన్‌క్రాఫ్ట్ పక్కనే డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్నానని ఖవాజా తెలిపారు. అయినప్పటికీ Cricket Australia తనను విచారణకు పిలవలేదని ఆరోపించారు. జట్టుగా బాధ్యత తీసుకోవాలని తాను భావిస్తున్న విషయం వారికి తెలుసు కాబట్టే తనను ప్రశ్నించలేదని అనుకుంటున్నట్లు చెప్పారు. విచారణ కోసం తన ఫోన్‌కు కాల్ వస్తుందని ఎదురుచూశానని, కానీ అలాంటిదేమీ జరగకుండానే ముగ్గురిపై శిక్షలు ప్రకటించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దక్షిణాఫ్రికా జట్టుపైనా ఖవాజా వ్యాఖ్యలు

ఈ వివాదానికి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశాన్ని కూడా ఖవాజా ప్రస్తావించారు. బంతిని Reverse Swing చేయడంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తమకంటే మెరుగ్గా వ్యవహరించేవారని, వారితో పోటీ పడేందుకు తాము ప్రయత్నించామని అన్నారు. ఆ జట్టు అనుసరించిన పద్ధతుల గురించి కూడా తన ఆత్మకథలో వెల్లడించనున్నట్లు తెలిపారు. అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గతంలోనూ బంతి ఆకృతిని మార్చే ప్రయత్నాలకు సంబంధించి రెండుసార్లు శిక్షలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఖవాజా తాజా వ్యాఖ్యలతో ఎనిమిదేళ్ల క్రితం ముగిసిపోయిందనుకున్న Sandpaper Gate వివాదం మరోసారి క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఆత్మకథ విడుదలైన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయా? అన్న ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు