పువ్వులకే పూజ! బతుకమ్మ!!

10-10-2026 | 05:05am

పువ్వులతో దైవారాధన చేయడం అందరికీ తెలిసిందే. కానీ, పువ్వులనే పూజించడం దక్షిణ భారతాన ఒక్క తెలంగాణలోనే(Telangana) కొనసాగే అద్వితీయమైన, అబ్బురమైన ఒక సంబురం. అతివలకు ప్రీతిపాత్రమైన వేడుక బతుకమ్మ(Batukamma Festival). నిజానికి ప్రతీ పండుగ వెనుక ప్రకృతితో సంబంధం ఉంటుంది.

రుతువులకు అనుబంధంగా పండుగలు వస్తుంటాయి. ఆయా కాలాల్లో పూసే, కాసే, పండే పంటలకు సంబంధం ఉంటుంది. వాతావరణంతో పెనవేసుకుంటుంది. పండుగ ఏదైనా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేసుకోవచ్చు. పేర్లు కూడా వేరే ఉండొచ్చు. అందులో దక్షిణభారతదేశంలో, తెలంగాణాలో బతుకమ్మ పండుగ ఒకటి. చాలా విశిష్టమైనది. పెద్దలు, పేదలు అనకుండా అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ.

జానపదుల పండుగ..

బతుకమ్మ జానపదుల పండుగ. ఎంతకాలం నుంచి ఈ పండుగ జరుపుతున్నారనే దానికి శాసనాధారాలకన్నా సంప్రదాయ ఆచరణే ప్రధానంగా కొనసాగుతూ వస్తోంది. ఇందుకు మెదక్ జిల్లా వేల్పుగొండ తంబురేవ్వరాలయం గోడల మీద బతుకమ్మను ఎత్తుకున్నట్టు ఉన్న శిల్పమే నిదర్శనం. ఇంకా తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉన్న శాసనం రాయలకాలంలో బతుకమ్మ పండుగను ప్రస్తావిస్తున్నది.

బతుకునిచ్చిన అమ్మ.. బతుకమ్మ

గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లను మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని ముడుపులు కడుతుంటారు. ఆ మొక్కులు చెల్లించుకుంటారు. అలా వేడుకునే దేవతల్లో బాలమ్మ, ఉప్పలమ్మ, మైసమ్మ వంటి దేవతల్లో బతుకమ్మ ఒక రూపం. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్య అని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేర్లు ఇప్పటికీ వినిపిస్తాయి. 

దసరా ముందు సరదాల సంబురం

ఆశ్వయుజమాసంలో దసరాకు ముందొచ్చే పూలపండుగ బతుకమ్మ. ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దుల వేడుకతో ముగుస్తుంది. బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ వేడుక జరుపుకుంటారు. అలనాటి రోజుల్లో గర్భిణులు నీళ్ళాడే (ప్రసవం) సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి.

టి రేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతు బతికినందుకు ప్రతీకగా నీటివారన పెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసి వుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మ పండుగగా మారి ఉంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మన గొప్ప సంస్కృతికి సాక్ష్యం. 

బుద్ధుని కాలంలో...

బౌద్ధంలో ముందు చెడ్డ దేవతగా, పిల్లలను ఎత్తుకపోయే రాక్షసిగా పిలువబడ్డ హారీతి.. బుద్ధుని వల్ల మంచిదానిగా, పిల్లలను రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లల దేవతగా కొలుస్తారు. పుట్టిన పిల్లలు బతకాలని, రోగం, రొష్టు లేకుండా వుండాలని హారీతిని ఆరాధించేవారు.

ఈ దేవతను గురించి బౌద్ధ జాతక కథల్లో చదువగలం. వివిధ చారిత్రకదశల్లో ఈ దేవత విగ్రహాలు వేర్వేరు రూపాల్లో అగుపిస్తున్నాయి. చాళుక్యులు తమను తాము హారీతిపుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు. 2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలంనుండి హారీతి శిల్పాలు కనిపిస్తున్నాయి.12వ శతాబ్దందాకా శాసనాల్లో హారీతిపేరు ప్రస్తావించబడ్డది. పిల్లలను బతికించే దేవత హారీతినే ఆ తర్వాతి కాలంలో బతుకమ్మగా భావించి ఉంటారనే నానుడి కూడా ఉంది. 

కథకథలుగా.. 

కూష్మాండిని దేవతకు ప్రతీకగా గుమ్మడిపువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మనపూర్వీకులు ఇనుము-ఉక్కు తయారీకి తంగేడుచెక్కను వాడేవారని మనం తెలుసుకున్నాం. తోలుతయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికి తెలుసు. గునుగుకు నీళ్ళను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్యజీవితాసరాలైన తంగేడు, గునుగుపూలతో మనపూర్వీకులు తమ దేవత(కూష్మాండిని)ని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారివుంటుంది.

గునుగు, తంగేడు పువ్వులతో కొప్పురం రూపంలో పూలబతుకమ్మను పేర్చి, శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వును ఉవచి, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పూజ పువ్వులను తొక్కుట్ల వెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్ళలో వదిలే సంప్రదాయమైంది. దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూదేవత నవదుర్గ రూపాల్లో కూష్మాండిని ఒకటి. ఎనిమిదవ రోజున కూష్మాండినిని అర్చిస్తారు. అదేరోజు బతుకమ్మలాడుతారు.

కొన్ని ప్రాచీన ఆచారాలను మతాలు స్వంతం చేసుకున్న క్రమం చరిత్రలో కనిపిస్తుంది. ఈ పండుగకు కూడా కులాల మసిపూయడం అనాచారం. ఇది పెద్ద కులాల పండుగ కాదు తక్కువ(చిన్నకులాల,జాతుల) వాళ్ళదే. గిరిజనులదే. తొలి మొలకలను, తొలిపూతను కొలిచే ఆచారం గిరిజనులదే. పువ్వంటే రేపటి ఫలమని వాళ్ళకు తెలుసు. ఆడపిల్లలను, పువ్వులను కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు.

మతాచారాలు రుద్దబడ్డాయి. మనప్రాంతంలో కూష్మాండిని ఆరాధన జైనుల వల్ల వచ్చింది. జైన మతానుయాయులైన కాకతీయుల వల్ల ప్రోత్సహించబడ్డది. జైనంలో 22వ తీర్థంకరుణి శాసనదేవత.. యక్షిణి అంబిక లేదా కూష్మాండిని (గుమ్మడితీగె, గుమ్మడిపువ్వు). ఈమె చేతుల్లో ఫలాలతో, ఇద్దరు పిల్లలతో, మామిడిచెట్టు కింద కూర్చొని వున్నట్టు వుంటుంది. అంబిక కూడా ఒక అమ్మదేవతే. ఈ దేవతలకు ప్రతి రూపాలు క్రీ.శ. 5వ శతాబ్దం నుంచే కల్పించబడ్డాయి. అంతకు ముందున్నట్టు చారిత్రక ఆధారాలు లేవు. 

బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో వుంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయం ఉందని చాలాచోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారు చేసుకునేవారు. బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్దునికి ప్రతీకగా నమస్కరించేవారు.

పూలు, ఇసుక, మట్టి, పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు, ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించివుంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా బతుకమ్మను దేవతను చేసుకుని వుంటారు. పిదప కాలాల్లో వచ్చిన మత పరిణామాల వల్ల ఈ దేవతలను తమతమ మత దేవతలుగా చేసుకున్నారు.

ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకూష్మాండినిగా, హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు. తెలంగాణాలో అతిప్రాచీనమైన అమ్మ దేవతల ఆరాధనమే తల్లుల రూపంలో ఏ దేవత వచ్చినా తమ దేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మ జాతరగా నిలిచిపోయింది. దసరా పండుగతో బతుకమ్మను కలపడం, అమ్మ దేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం ‘పెత్రామాస’(పితృ అమావాస్య)ను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిణామమే.

జానపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వానివి. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు, మన తెలంగానకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూల పూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మన మూలాలను ఎరుకపరిచే మంచి సంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట.

దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చేయొద్దు. బతుకమ్మ పూల శిల్పం. పువ్వులబొమ్మ. బతుకమ్మ సహజ సౌందర్య ప్రతీక. తీరొక్కపూలతో బతుకమ్మను చేయడం జానపదుల హస్తకళకు ఎత్తిన జెండా. బతుకమ్మను చేసుకుంట పల్లెప్రజలు మురిసిపోతుంటరు. గుళ్ళో కాదు ఇండ్లల్లనే నిలుపుకున్న అమ్మ దేవత బతుకమ్మ. వేలయేండ్ల మానవ సంస్కృతికి పట్టిన పూల హారతి.

వ్యాసకర్త, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

ఈ పండుగ తొమ్మిదొద్దుల పండుగ. బతుకమ్మ పండుగను తొమ్మిది ఒద్దులు (దినాలు) తొమ్మిదితీర్ల చేస్తారు

1.    ఎంగిలిపూల బతుకమ్మ: మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని  అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు             కలిపి నైవేద్యం సమర్పిస్తారు.

2. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యంగా చేస్తారు. 

3. ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.

4. నానుబియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

5. అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

6. అలిగిన బతుకమ్మ : ఈ రోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.

7. వేపకాయల బతుకమ్మ: బియ్యం పిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

8. వెన్నెముద్దల బతుకమ్మ:  నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

9. సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు.

ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.బతుకమ్మ తెలంగాణ ఉద్యమ పతాకం: మలిదశ తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమంగా బతుకమ్మ తెలంగాణ అస్తిత్వ ప్రకటనగా గౌరవించబడ్డది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఉద్యమ చైతన్య రూపమైంది.

ఒక్కొక్క పేపరేసి చందమామ..  

సాధారణంగా బతుకమ్మ పండుగ అనగానే ఒక్కొక్క పువ్వేసి చందమామ.. అనే పాట గుర్తుకొస్తుంది. కానీ.. నేడు ఒక్కొక్క పేపరేసి అని పాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బతుకమ్మ అంటేనే పూలు. ప్రకృతిలో లభించే తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చడం సంప్రదాయంగా వస్తోంది. ముఖ్యంగా తంగేడు, గునుగు పువ్వులకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఆ పువ్వులు దొరకడమే మహద్భాగ్యంగా మారింది. రియల్ ఎస్టేట్ పుణ్యమో, పారిశ్రామిక అభివృద్ధి ఫలమో గానీ.. బతుకమ్మ పువ్వులకు కరువు ఏటేటా పెరుగుతూనే ఉంది. 

పూలకు బదులు పేపర్ !

పూల కొరత నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో పూల బతుకమ్మలకు బదులుగా పలు రంగుల పేపర్లతో తయారు చేసిన బతుకమ్మలను ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొందరు మహిళలు తంగేడు, గునుగు పూలకు బదులుగా బంతి, చామంతి, గులాబీ వంటి ఇతర పూలతో బతుకమ్మలను పేర్చుతున్నారు. ఒకప్పుడు గ్రామాల చుట్టుపక్కల విరివిగా కనిపించిన సంప్రదాయ బతుకమ్మ పూలు ఇప్పుడు తక్కువగా లభించడం పండుగ రూపంలోనూ మార్పునకు కారణమవుతోంది.

మారుతున్న పల్లె వాతావరణం

పొలాల గట్లు, చెరువుల పరిసరాలు, ఖాళీ ప్రదేశాల్లో సహజంగా పెరిగే తంగేడు, గునుగు మొక్కలు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో తగ్గిపోతున్నాయి. గ్రామాల్లో ఖాళీ స్థలాలు తగ్గడం, పంట భూముల విస్తరణ, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వంటి కారణాలతో సంప్రదాయ పూల లభ్యత తగ్గుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో బతుకమ్మ కోసం పూలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది.

సంప్రదాయ పూలను కాపాడుకోవాలి

బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ లో పూలు, ప్రకృతి, పల్లె జీవన విధానంతో ముడిపడిన సంస్కృతి. అందుకే తంగేడు, గునుగు వంటి సంప్రదాయ పూల మొక్కలను గ్రామాల్లో విరివిగా పెంచాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ తరాలకు బతుకమ్మ పండుగ అసలైన పూల పరిమళంతో అందాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

 శివప్రసాద్‌గౌడ్, విజయ క్రాంతి రిపోర్టర్, బిక్కనూర్ మండలం, కామారెడ్డి జిల్లా.


మరిన్ని వార్తలు