కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

21-11-2026 | 03:03pm

* కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్ష

* కేటీఆర్ సభకు అంచనాలకు మించి ప్రజలు తరలిరానున్నారు

* ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ,(విజయక్రాంతి): జన చైతన్య సభ(Jan Chaitanya Sabha) పేరిట నవంబర్ 22న కేడీసీ గ్రౌండ్ లో నిర్వహించనున్న సభా స్థలిని బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లతో కలిసి మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ... సభకు సుమారు 20 వేల మంది వస్తారని తొలుత అంచనా వేసినప్పటికీ, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే అంతకుమించిన స్థాయిలో జనసమీకరణ జరిగే అవకాశం ఉందన్నారు.

కేటీఆర్(KTR) ప్రసంగాన్ని వినేందుకు వేలాదిగా ప్రజలు తరలిరానున్నారని, సభా ప్రాంగణం కూడా సరిపోని పరిస్థితి ఏర్పడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీ(BRS Party)లో చేరనున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్(KCR) పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రజల పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్షగ ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో నాయకులు, ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి తన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి కూడా లేదని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి నెలకొందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, మేధావులు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో వరంగల్ నగరానికి ప్రత్యేక స్థానం ఉందని, ఉద్యమానికి నగరం ఎప్పుడూ అండగా నిలిచిందని గుర్తుచేశారు.

వరంగల్ నగర ప్రజలు, రాజకీయ నాయకులు, మేధావులు తెలంగాణ ఉద్యమానికి అందించిన సహకారం మరువలేనిదన్నారు. అదే చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంగణంలో ఇప్పుడు కేటీఆర్ సభ జరగడం విశేషమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో అసమ్మతి రగడ మొదలైంది అన్నారు.ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తాము ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, కాంగ్రెస్‌లోని అంతర్గత పరిణామాలే ఆ పార్టీకి సమస్యగా మారాయని అన్నారు.

ఆదివారం నిర్వహించనున్న కేటీఆర్ జన చైతన్య సభ ఈ రాజకీయ ప్రయాణంలో ఒక ముందడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని సభలు నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు, లలిత యాదవ్,కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు