ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, అక్టోబర్ 7 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఎన్నికల ప్రచారం(RTC Election Campaign)లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోలోని ప్రయాణ ప్రాంగణంతో పాటు కార్మికులు విధులు నిర్వహిస్తున్న గ్యారేజ్ ప్రాంతాన్ని సందర్శించి ఆర్టీసీ కార్మికులను కలుసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
ఆర్టీసీ కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సంస్థ అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐ ఎన్ టి యు సి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వీఎస్ రావు బాణం గుర్తుకు, మొగుళ్ల రాజిరెడ్డి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ఘన విజయం చేకూర్చాలని కార్మికులను కోరారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ఆర్థిక భారం తగ్గించిందని బీర్ల అయిలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, ఐ ఎన్ టి యుసి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.