మాలలకు న్యాయం చేయాలి
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్క కమలాకర్
మల్లాపూర్ నవంబర్ 13(విజయక్రాంతి): మాలలకు న్యాయం చేయాలని, రోస్టర్ పాయింట్లను(roster points) సవరించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం(All India Ambedkar Youth Association) జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్క కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన వివిధ దళిత సంఘాల నాయకులను కలిసి నవంబర్ 15న కోరుట్ల పట్టణంలో నిర్వహించనున్న ‘హలో మాల – చలో కోరుట్ల’ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ.. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రోస్టర్ పాయింట్ల విధానాన్ని అమలు చేస్తూ మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రోస్టర్ పాయింట్లలో మాలలకు 22వ స్థానం కేటాయించడం వల్ల ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసిన ఉద్యోగాల్లో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్లను సవరించి మాలలకు కేటాయించిన పాయింట్లలో రెండు పాయింట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ పాయింట్ల అంశంపై పునరాలోచన చేసి మాలలకు న్యాయం చేయాలని కోరారు. రోస్టర్ పాయింట్లలో సవరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇప్పటికే మెట్పల్లి పాత తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో విడతల వారీగా తహసీల్దారులకు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు.
నవంబర్ 15న కోరుట్ల పట్టణంలో నిర్వహించనున్న ‘హలో మాల – చలో కోరుట్ల’ బహిరంగ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల మాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో ఉడుగుల గంగాధర్, అచ్చ చిన్న, గోపి, శాంతయ్య, ఉడుగుల రాజ్యం, కోడిపెల్లి రాజేందర్, మద్దెల స్వామితో పాటు పలు గ్రామాల మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.