రీ సర్వే లో నాణ్యత, పారదర్శకత కు అత్యంత ప్రాధాన్యత

12-11-2026 | 10:08pm

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, నవంబర్ 12 ( విజయ క్రాంతి ) :జిల్లాలో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతముగా, పకడ్బందీగా పూర్తి పారదర్శకతతో,నిర్దేశిత గడువులోగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(District Collector B. Satya Prasad) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవోలు, మండల తహశీల్దార్లు, భూ సర్వే శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ రీసర్వే పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రీసర్వే చేపట్టాల్సిన మొత్తం భూమి విస్తీర్ణం ఎన్ని ఎకరాలు ఉంది. ఇప్పటివరకు ఎన్ని ఎకరాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా ఎన్ని ఎకరాల్లో సర్వే నిర్వహించాల్సి ఉందనే వివరాలను మండలాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలంలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, మిగిలి ఉన్న సర్వే పనులు, వాటిని పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీసర్వే ప్రక్రియను ప్రాధాన్యతగా తీసుకొని క్షేత్రస్థాయిలో పనుల వేగం పెంచాలని సూచించారు. రీసర్వేకు సంబంధించి ప్రతి మండలానికి నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు. జిల్లాలో నిర్వహించే భూరి సర్వే ప్రక్రియలో కచ్చితంగా కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పనులను త్వరితగతిన డిసెంబర్ మొదటి వారంలోగా ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పూర్తిచేయాలని ఆదేశించారు.

రీసర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవోలు, మండల తహశీల్దార్లు, భూ సర్వే శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మండలాల వారీగా సర్వే పూర్తయిన విస్తీర్ణం, ఇంకా పెండింగ్‌లో ఉన్న భూముల వివరాలను ప్రతి రోజు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

నిర్దేశిత గడువులోగా జిల్లాలో రీసర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేనియెడల కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబ, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, మెట్‌పల్లి ఆర్డీవో నరసింహారావు, భూ సర్వే శాఖ ఏడీ, మండల తహశీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు