47 కేసుల్లో సీజ్ చేసిన రూ.9.50 లక్షల గంజాయి దహనం
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, నవంబర్ 13 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లా(Jagtial District) వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 47 కేసులకు సంబంధించి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 19 కిలోల గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినరేషన్ (దహనం) ప్రక్రియ ద్వారా దహనం చేసిన గంజాయి విలువ సుమారు రూ.9.50 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
ఎన్డీపీఎస్ (NDPS) చట్టంలోని నిబంధనల ప్రకారం, పర్యావరణ కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ గంజాయిని దహనం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్గా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, వ్యవహరించగా, కమిటీ సభ్యులుగా అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, వేణు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొందరు అక్రమ సంపాదనే లక్ష్యంగా గంజాయి సాగు, విక్రయాలు, రవాణాకు పాల్పడుతూ పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారని అన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా, నిబంధనలకు విరుద్ధంగా కలిగి ఉన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, రవికుమార్, పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.