డబుల్ రోడ్డు వేయాలి - రంజిత్ రెడ్డి
జనగామ, నవంబర్ 11 (విజయక్రాంతి): జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలం, తరిగొప్పుల మండలంలోని గ్రామాలకు వెళ్లే మార్గాల్లో డబుల్ రోడ్డు వేయాలని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు(Senior Congress leader) పోలపల్లి రంజిత్ రెడ్డి కోరారు. కొమ్ము గుట్ట నుండి లింగంపల్లి గ్రామం, శ్రీపతిపల్లి మీదుగా ఏననాయక్ తండా వరకు, అదేవిధంగా లింగంపల్లి నుండి అబ్దుల్ నాగారం మీదుగా మరియపురం వరకు డబుల్ రోడ్డు వేయాలని తెలిపారు.
ప్రస్తుతం ఈ మార్గాల్లో సింగిల్ రోడ్డు మాత్రమే ఉండటంతో వాహనాల రద్దీ రోజురోజుకు పెరిగిపోతోందని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు పక్కకు తప్పించుకోవడానికి స్థలం లేక ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు. ఈ రోడ్లపై స్కూలు పిల్లలు, రైతులు, కూలీలు, ఉద్యోగులు నిత్యం ప్రయాణిస్తున్నారని, వారికి సురక్షితమైన ప్రయాణం కోసం డబుల్ రోడ్డు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, గ్రామాల అభివృద్ధికి కూడా డబుల్ రోడ్డు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఈ రెండు మార్గాల్లో డబుల్ రోడ్డుకు సర్వే చేసి, త్వరగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.