చైర్మన్ సంతకం లేకుండా చెక్కుల చెల్లింపు
ఉద్యోగి పై వేటు కు తీర్మానం
జనగామ,అక్టోబర్ 7 (విజయక్రాంతి): జనగామ వ్యవసాయ మార్కెట్(Jangaon Agricultural Market) నూతన కార్యాలయంలో పాలకవర్గ అత్యవసర సమావేశం జరిగింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన చెక్కులపై చైర్మన్ బనుక శివరాజు సంతకం లేకుండా, కేవలం కార్యదర్శి సంతకంతో కాపలాదారు కె. ఐలయ్య ఖజానా కార్యాలయం ద్వారా చెక్కులు మార్చుకున్న విషయం బయటపడింది.
చైర్మన్ నిలదీయగా దురుసుగా ప్రవర్తించాడని, వెంటనే అతడిని తొలగించాలని పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసి జిల్లా అధికారికి పత్రం అందజేసింది. చైర్మన్ శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ, తమకు తెలియకుండా చెక్కులు దుర్వినియోగం చేశారని, గతంలో కూడా అవినీతికి పాల్పడిన వారిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
వచ్చే పంట కాలానికి రైతుల కోసం అన్ని ఏర్పాట్లు పరిశీలించామని, మార్కెట్ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించామని అన్నారు. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు నాగబండి రవీందర్, నీల మోహన్, బుట్ రెడ్డి శ్రీలత రెడ్డి, ఎండి బాష్మియా, నామాల శ్రీనివాస్, తోటకూరి రమేష్, బానోతు బన్సీ నాయక్, శీలం కొండల్ రెడ్డి, పార్ష సిద్దేష్, బండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.