రీసర్వేపై ప్రత్యేక అవగాహన సదస్సు
మోతె, అక్టోబర్ 07 (విజయక్రాంతి): మండల పరిధిలోని మామిళ్లగూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో సింగరేణిపల్లి గ్రామ రెవెన్యూ శివారులో గల రైతులకు భూముల రీసర్వేపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోతె తహశీల్దార్ వెంకన్న(Tahsildar Venkanna) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిపల్లి గ్రామాల పరిధిలోని భూముల సర్వే నెంబర్లకు రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ రీసర్వే ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతి భూమికి సంబంధించిన హద్దులను ఖచ్చితంగా కేటాయించి, వివాదాలకు తావులేకుండా పక్కాగా రికార్డులను సిద్ధం చేస్తామని రైతులకు వివరించారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క భూయజమానికి విశిష్టమైన 'భూధార్' కార్డును అందజేయడం జరుగుతుందని వెల్లడించారు.
ఈ భూధార్ కార్డు లభించడం వల్ల రైతులకు తమ భూములపై పూర్తి నిశ్చింత, చట్టపరమైన భద్రత లభిస్తుందని, భవిష్యత్తులో ఎలాంటి భూవివాదాలు తలెత్తే అవకాశం ఉండదని తహశీల్దార్ స్పష్టం చేశారు. రైతులందరూ అధికారులకు సహకరించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగమణి, ఆర్ ఐ లు కరుణాకర్ రెడ్డి, రమేష్, పంచాయతీ కార్యదర్శి కవిత , జిపిఓ ప్రవీణ్ గ్రామ రైతులు , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.