లోవోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని ధర్మారం రైతుల రాస్తారోకో
కోనరావుపేట అక్టోబర్ 7 (విజయక్రాంతి):వ్యవసాయానికి సరైన సమయంలో విద్యుత్ సరఫరా కావడం లేదని, లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు(Agricultural motors) కాలిపోతున్నాయని ధర్మారం గ్రామ రైతులు ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు సిరిసిల్ల–నిమ్మపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
కాలిపోయిన వ్యవసాయ బోరు మోటార్‌ను రోడ్డుకు అడ్డంగా ఉంచి రైతులు నిరసన వ్యక్తం చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.నిరసన స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారులను రైతులు నిలదీశారు.ఒక ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో రోజు మార్చి రోజు విద్యుత్ సరఫరా చేస్తున్నారని, దీంతో పంటలకు సరిపడా నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపించారు.
అలాగే లోవోల్టేజీ కారణంగా తరచూ వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు తెలిపారు.విద్యుత్ సరఫరాలో సమస్య ఉన్న ప్రాంతానికి అధికారులు తమతో కలిసి రావాలని, అక్కడే సమస్యను పరిశీలించి పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.వ్యవసాయానికి వెంటనే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు.సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.