24 డిమాండ్లను వెంటనే అమలు చేయాలి

18-11-2026 | 08:02pm

ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్

భూపాలపల్లి, నవంబర్ 18 (విజయ క్రాంతి): సింగరేణి యాజమాన్యంతో(Singareni Management) జరిగిన చర్చల్లో అంగీకరించిన 24 డిమాండ్లను వెంటనే అమలు చేస్తూ సర్క్యులర్లు జారీ చేయాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి(AITUC Branch Secretary) మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. డిమాండ్ల అమలును కోరుతూ భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మారుపేర్ల సమస్య పరిష్కారం, డిపెండెంట్ ఉద్యోగాల ఉత్తర్వులు, కార్మికులకు ఇంటి స్థలాలు, డిస్మిస్ కార్మికులకు మరో అవకాశం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. సింగరేణిపై ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి, సంస్థ నిధులను అభివృద్ధి, కార్మిక సంక్షేమానికి వినియోగించాలని అన్నారు.

సంస్థపై ఉన్న రూ.60 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు గురుజపల్లి సుధాకర్ రెడ్డి, నూకల చంద్రమౌళి, రవికుమార్, నాయకులు కృష్ణారెడ్డి, ఎల్. శంకర్, పి. శ్రీను, కార్తీక్, హాస్పిటల్ రమేష్ తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు