జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం మనవడు శివశంకర్ రెడ్డి చేయూత
మహబూబాబాద్, (విజయక్రాంతి): సేవ చేయడానికి పదవులు(Positions), హోదాలు అవసరం లేదని, సమాజానికి ఉపయోగపడాలనే మంచి మనసుంటే చాలని యువకుడు జన్నారెడ్డి శివశంకర్ రెడ్డి(Jannareddy Shivashankar Reddy) నిరూపించారు. తన తాత, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే దివంగత జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి(MLA Jannareddy Janardhan Reddy) జ్ఞాపకార్థం సుమారు రూ.2 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి 30 ఫ్యాన్లు, రోగులకు దుప్పట్లు అందజేశారు. అలాగే అనంతారం గ్రామంలో గ్రామ భద్రతకు ఉపయోగపడేలా సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు నాలుగు ప్రొజెక్టర్లు, విద్యార్థుల్లో క్రీడా ఆసక్తిని పెంపొందించేందుకు క్రీడా పరికరాలను అందజేశారు.
గ్రామస్తులతో కలిసి ఈ పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. తన తాత మాజీ ఎమ్మెల్యే జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ సహకారం అందించినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు ఆధునిక బోధనా విధానాలకు ప్రొజెక్టర్లు ఉపయోగపడతాయని, క్రీడా పరికరాలతో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సిబ్బందికి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఫ్యాన్లు, దుప్పట్లు అందించామని తెలిపారు.
ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉపశమనం కలిగిస్తూ, గ్రామ భద్రతకు భరోసా కల్పించేలా చేపట్టిన ఈ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ప్రజాప్రతినిధులుగా ఉండటం మాత్రమే సేవ కాదని, వ్యక్తిగతంగా ముందుకొచ్చి సమాజానికి తమ వంతు సహకారం అందించవచ్చని శివశంకర్ రెడ్డి తన సేవా కార్యక్రమాల ద్వారా చాటిచెప్పారు. తాత జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగిస్తూ సమాజానికి అండగా నిలుస్తున్న శివశంకర్ రెడ్డిని గ్రామస్తులు, పలువురు అభినందించారు.