అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ
వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
భూపాలపల్లి, నవంబర్ 18 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) నవంబర్ 19న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని, అదే సమయంలో అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రారంభోత్సవాలు నిర్వహించాలని సూచించారు.హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పథకం ఏర్పాట్లను సీఎస్ సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) మాట్లాడుతూ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహించి, 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సున్న కుటుంబ సంపాదన సభ్యుల్లో ఒకరికి రూ.5 లక్షల బీమా రక్షణ అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి నమోదు చేయాలని సూచించారు.
రేషన్ డీలర్లు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని, నామినీ వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అర్హులైన ఏ కుటుంబం పథకం నుంచి దూరం కాకుండా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, ఆర్డీఓ హరికృష్ణ, ఇతర జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.