జంగంపల్లి పాఠశాలలో అవగాహన సదస్సు

18-11-2026 | 07:40pm

భిక్కనూర్, నవంబర్ 18 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం జంగంపల్లి ఉన్నత పాఠశాలలో(Jangampalli High School) కామారెడ్డి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం(Awareness Program) నిర్వహించారు.

ఆటపాటలు, మాటల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం నింపారు. ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, బాలలపై జరిగే అకృత్యాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై వివరించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి వాస్తవాలను తెలుసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, గురువుల మాట వింటూ క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా షీ టీమ్స్ పనితీరు, మహిళల రక్షణ, పోక్సో చట్టం, మైనర్లపై జరిగే నేరాలు,

తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డబ్ల్యూపీసీ ప్రవీణ వివరించారు. మానవ అక్రమ రవాణా వల్ల కలిగే ప్రమాదాలపై పీసీ రాజేందర్ అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బాధితులు 1930కు, మాదక ద్రవ్యాల సమాచారానికి 1908కు, మహిళల రక్షణ కోసం షీ టీమ్ నంబర్ 8712686094కు, అత్యవసర సహాయం కోసం 112కు ఫోన్ చేయాలని సూచించారు.

కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషారావు, పీసీ ప్రభాకర్, భిక్కనూర్ ఏఎస్ఐ ఆర్.వి. వెంకట్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు