ఇందిరమ్మ బీమా పథకానికి జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు
అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
నేటి నుంచి గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక నమోదు శిబిరాలు
పెద్దపల్లి, నవంబర్ 18(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) (ఐకేజేబీపీ) ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత(Life Insurance Security) కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) తెలిపారు. ఈ పథకం అమలుకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్(Ramagundam Municipal Corporation) వార్డు అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే పథకం నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు ముందుగానే శిబిరాల తేదీలు, ప్రదేశాల వివరాలు తెలియజేయాలని, డప్పు చాటింపు ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
రూ.5 లక్షల జీవిత బీమా భద్రత
కుటుంబంలో సంపాదించే సభ్యునికి జీవిత బీమా రక్షణ కల్పించడం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే పథకం ఉద్దేశమని కలెక్టర్ వివరించారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని, 19-11-1967 నుంచి 18-11-2008 మధ్య జన్మించిన వారు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలతో పాటు రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా పథకంలో నమోదు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇతర జిల్లాలకు చెందిన ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాలు కూడా సమీపంలోని శిబిరాల్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మీ సేవ ద్వారా నమోదు
ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాలకు మీ సేవ ద్వారా ముందుగా వివరాలు నమోదైన దరఖాస్తు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కుటుంబ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసిన అనంతరం బీమాదారుడిని ఎంపిక చేసి, నామినీ వివరాలు నమోదు చేయాలని సూచించారు. రేషన్ కార్డు లేని వారు ఖాళీ దరఖాస్తు ద్వారా కొత్తగా నమోదు చేసుకోవచ్చని, బీమాదారుడి ఆధార్ కార్డు ప్రతితో పాటు కుటుంబ సభ్యులు, నామినీ వివరాలు సమర్పించాలని తెలిపారు. కావాల్సిన ధ్రువపత్రాలు బీమాదారుడి ఆధార్ కార్డు జిరాక్స్, కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, ఆహార భద్రత కార్డు (ఉంటే),మొబైల్ నంబర్, నామినీ వివరాలు ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను ఎంపిక చేసుకుంటే వారికి కేటాయించే బీమా వాటాల మొత్తం 100 శాతంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
అర్హులను వెనక్కి పంపించవద్దు
ప్రతి శిబిరంలో హెల్ప్‌డెస్క్, అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేయాలని, కంప్యూటర్లు, ఇంటర్నెట్, ప్రింటర్లు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందించాలని తెలిపారు.
ముఖ్యంగా డేటా అందుబాటులో లేదనే కారణంతో ఏ ఒక్క అర్హుడినీ శిబిరం నుంచి వెనక్కి పంపించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ నమోదైన దరఖాస్తుల వివరాలను సమీక్షించి నివేదికలు అందించాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రతి ఇంటికి పథకం సమాచారం చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఈడీఎం కవిత, సంబంధిత అధికారులు, రామగుండం మున్సిపల్ వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.