గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

12-11-2026 | 09:30pm

అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం

భూపాలపల్లి,(విజయక్రాంతి): రాబోయే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, భద్రత తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అనువైన ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను గుర్తించి, వాటర్‌ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ భక్తులు, వాహనాల రద్దీకి అనుగుణంగా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చోట్ల బూస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో ఎఎస్పీ నరేష్ కుమార్‌తో పాటు దేవాదాయ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు