బుగులోని జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): రేగొండ మండలం తిరుమలగిరిలో ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బుగులోని జాతర(Buguloni Jathara)కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
నాలుగు ప్రధాన రహదారుల్లో గుంతల పూడ్చివేత, జంగిల్ క్లియరెన్స్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. జాతర అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని, పార్కింగ్, దుకాణాలు, స్టాళ్లకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు.
భక్తులకు నిరంతర తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. కొండపైకి వెళ్లే భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో అటవీ శాఖ అధికారి కిష్టా గౌడ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సింగరేణి జీఎం రాజేశ్వరరెడ్డి, ఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.