కాళేశ్వరం ఈఓపై సర్పంచ్ ఫైర్!

30-10-2026 | 10:53am

భూపాలపల్లి / కాళేశ్వరం, అక్టోబర్ 30 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) మహేష్ వ్యవహారశైలిపై గ్రామ సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనులు, అధికారుల పర్యటనల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. కాళేశ్వరంలోని హరిత హోటల్‌లో గ్రామపంచాయతీ పాలకవర్గం, పలువురు వార్డు సభ్యులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం క్షేత్ర అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ, ఈఓ వ్యవహారశైలి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉందని సర్పంచ్ ఆరోపించారు. అభివృద్ధి పనులను సక్రమంగా పర్యవేక్షించడం లేదని, తనకు అనుకూలమైన సమయంలోనే ఆలయానికి వచ్చి వెళ్తున్నారని విమర్శించారు. ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ (Protocol) పాటించకపోవడం, ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఆలయ ఆవరణలో నిర్మించిన 100 గదులు ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గదుల్లో బస చేస్తున్న భక్తులు భయాందోళనల మధ్య గడపాల్సి వస్తోందని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా గదులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని కోరారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఆలయ అభివృద్ధి పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పనుల పురోగతిపై నిత్యం సమీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఈఓ మహేష్ వ్యవహారశైలిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ మోహన్ రెడ్డి కోరారు. ఆలయ అభివృద్ధి పనులు పారదర్శకంగా సాగడంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు