ఇస్రో సందర్శనకు పరీక్ష.. రేపే చివరి ఛాన్స్
ఎల్లారెడ్డి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): పదో తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శ్రీహరికోట కేంద్రాన్ని సందర్శించే అవకాశం కల్పించేందుకు ఈనెల 31న ప్రతిభా పరీక్ష (Talent Test) నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి రాజులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాగ్వాన్ ఆదేశాల మేరకు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి అధ్యక్షతన ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ పోటీ పరీక్షకు ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ (Registration) చేసుకున్నారని తెలిపారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాజులు వెల్లడించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్ల విద్యార్థినుల కోసం కామారెడ్డిలోని బృందావన్ గార్డెన్లో, బాన్సువాడ డివిజన్ విద్యార్థినుల కోసం బోర్లం రోడ్డులోని వెంకటేశ్వర బీఈడీ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థినులు శనివారం ఉదయం 10 గంటలలోపు తమకు కేటాయించిన కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థినులు తమ వెంట ఆండ్రాయిడ్ మొబైల్ (Android Mobile) తీసుకురావచ్చని మండల విద్యాధికారి తెలిపారు.