అభివృద్ధికి చిరునామా మంత్రి శ్రీధర్ బాబు..

27-11-2026 | 09:45pm
  1. లేఖల రాజకీయాలకు చిరునామా ఎంపీ వంశీకృష్ణ!
  2. లేఖల రాజకీయం ఒక భూటకం 
  3. శిలాఫలకంపై సీఎం పేరు స్పష్టంగా ఉంది.
  4. ఆరోపణల్లో పసలేదంటూ ఎంపీ వంశీకృష్ణకు మండల ఎస్సీ సెల్ నాయకుల ఘాటు కౌంటర్

మహాదేవపూర్,నవంబర్ 27: మంథని నియోజకవర్గ(Manthani Constituency) అభివృద్ధికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అహర్నిశలు కృషి చేస్తుంటే, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాత్రం లేఖల రాజకీయాలతో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మహాదేవపూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు లేతకారి రాజబాబు, యూత్ కాంగ్రెస్ నాయకుడు కొండగొర్ల సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో విమర్శించారు.

ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు లేదంటూ ఎంపీ చేసిన ఆరోపణలు అవాస్తవమని, శిలాఫలకంపై సీఎం పేరు స్పష్టంగా ఉన్న ఫోటోనే అందుకు సాక్ష్యమని వారు స్పష్టం చేశారు.మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాలు లేఖల్లో కాదు.. ప్రజల జీవితాల్లో కనిపిస్తాయని నాయకులు పేర్కొన్నారు.

మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని, విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతులు, పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు.నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం, అభివృద్ధి పనులను పట్టాలెక్కించడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా మంత్రి పనిచేస్తుంటే.. ఎంపీ మాత్రం లేని వివాదాలను తెరపైకి తెస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం విచారకరమన్నారు.

శిలాఫలకాన్ని చూడలేదా..? లేక కావాలనే వివాదమా..?

మంథనిలో ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవన శిలాఫలకంపై సీఎం రేవంత్ రెడ్డి పేరు మొదటి వరుసలోనే స్పష్టంగా ఉందని, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోటోతో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ పేరు కూడా ఉందని తెలిపారు.

వాస్తవాలు ఇలా కళ్లముందు కనిపిస్తున్నప్పుడు ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమంలో లోపాలు ఉంటే నిర్మాణాత్మక సూచనలు చేయాలి కానీ, లేని వివాదాన్ని సృష్టించి ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధ్యతాయుతమైన ఎంపీ పదవికి తగదన్నారు.

శ్రీధర్ బాబు అభివృద్ధి ముందు లేఖల రాజకీయం నిలబడదు!

మంత్రి శ్రీధర్ బాబు పదవిని ప్రచారం కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఉపయోగిస్తున్నారని, ఆయన పనితీరే మంథని ప్రజలకు సమాధానమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని చూసి నేర్చుకోవాలని ఎంపీకి సూచించారు. మంథని అభివృద్ధి అంటే కేవలం రాజకీయ విమర్శలు చేయడం కాదని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి చూపించడమని హితవు పలికారు.

మరిన్ని వార్తలు