ఇంటిగ్రేటెడ్ స్కూల్ కంటే స్థానిక బడిపై దృష్టి పెట్టండి!

27-11-2026 | 11:13pm

- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

- చంపాపేట ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ 

ఎల్బీనగర్, నవంబర్ 27 : సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు(Integrated Schools) కాదు... ఇంటి ముందు ఉన్న స్కూళ్లను పెట్టించుకో అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) సూచించారు. చంపాపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను(Champapet Government Primary School) శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, పరిశీలించారు. ఏడాది క్రితం రూ.17 లక్షల వ్యయంతో పాఠశాలలో జీ+2 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు  కుండీలు ఏర్పాటు చేయకపోవడం, నీటి సౌకర్యం కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్టర్‌, డీఈవోకి ఫోన్ చేసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇంతమందికి కేవలం 8 నుంచి 9 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు తెలిపారు.

అలాగే 32 మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేదన్నారు. విద్యార్థులకు  కనీస, మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. “ఇంటిగ్రేటెడ్ స్కూల్స్”, “అంతర్జాతీయ స్థాయి విద్య” అంటూ గొప్పలు కాదు..  క్షేత్రస్థాయిలో విద్యార్థులకు సరైన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ విజయ, బీఆర్ఎస్ నాయకులు ముడుపు రాజిరెడ్డి, రవి ముదిరాజ్, గండికోట శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు