విద్యుత్ ఉచ్చులతో అశోక్ మృతి
మరో నిందితుడి కోసం గాలింపు
మహాముత్తారం, అక్టోబర్ 14 (విజయ క్రాంతి): జడల అశోక్ (32) మృతి కేసులో మిస్టరీని కాటారం సర్కిల్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కాటారం సీఐ నాగార్జునరావు(Kataram CI Nagarjuna Rao) నేతృత్వంలో ఎస్ఐలు జి. రమేష్, పి. మహేందర్‌కుమార్, సీహెచ్. శ్రీనివాస్,
జె. మహేష్, సిబ్బంది పక్కా సమాచారంతో యామన్‌పల్లి శివారులోని చెరువు సమీపంలో నిందితులు రత్నం వంశీకృష్ణ రత్నం రాజు అలియాస్ రాజేందర్, తలారి రాజేందర్‌ను గుర్తించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వంశీకృష్ణ, రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో సులభంగా డబ్బు సంపాదించేందుకు అటవీ జంతువులను వేటాడేందుకు 11 కేవీ విద్యుత్ లైన్ నుంచి ఇనుప బైండింగ్ వైర్లకు విద్యుత్ సరఫరా కలిపి అటవీ ప్రాంతంలో ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో పోడు భూమి చేసేందుకు అక్కడికి వెళ్లిన ఆజమ్నగర్కు చెందిన జడల అశోక్ విద్యుత్ ఉచ్చుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
మరుసటి రోజు ఉచ్చులను పరిశీలించేందుకు వెళ్లిన నిందితులు అశోక్ మృతదేహాన్ని గుర్తించి, తమ నేరం బయటపడుతుందనే భయంతో కర్రకు కట్టి సుమారు కిలోమీటరు దూరంలోని వాగు ఒడ్డున పొదల్లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అడవిలో దాక్కొని మహారాష్ట్రకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుబడ్డారు.
నిందితుల నుండి నేరానికి ఉపయోగించిన ఇనుప బైండింగ్ వైర్, కాటన్ వైర్, ఒక స్మార్ట్‌ఫోన్, ఒక కీప్యాడ్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ ఈ. నాగార్జునరావు, ఎస్ఐలు జి. రమేష్, పి. మహేందర్‌కుమార్, సీహెచ్. శ్రీనివాస్, జె. మహేష్‌తో పాటు పోలీసు సిబ్బంది రాజు, హరీష్, సత్యనారాయణ, లక్ష్మీరాజు, విక్రమ్, హరికుమార్, తిరుపతి, మశుక్, ఐటీ కోర్ వేణులను ఉన్నతాధికారులు అభినందించారు.
విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరమని కాటారం డీఎస్పీ తెలిపారు. ఇటువంటి ఉచ్చులు కనిపించినా, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.