ఒక్క ఓటు కూడా గల్లంతు కావొద్దు
భూపాలపల్లి టౌన్, నవంబర్ 21 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలదేనని సర్ కోఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ (Democratic Protection) కోసం ఓటు హక్కుల (Voting Rights) కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ బచావో.. దేశ్ బచావో సర్ ఫేజ్-3 (Vote Bachao Desh Bachao) కార్యక్రమానికి సిరాజ్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు, పట్టణ బూత్ లెవల్ ఏజెంట్లకు ఓటు హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఓటు రక్షక్ సేవకుల అప్లికేషన్ (Application) డౌన్‌లోడ్ చేసుకోవడం, నమోదు చేసుకోవడం, సామాన్య ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు దాన్ని వినియోగించుకునే విధానాన్ని వివరించారు. బూత్ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు అందించాల్సిన సేవలపై అవగాహన కల్పించారు.
అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి బూత్‌లో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని డివిజన్లు, మండలాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, ఓటు రక్షక్ సేవకులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.