సకాలంలో పన్ను చెల్లిద్దాం.. పట్టణాన్ని అభివృద్ధి చేద్దాం!
మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్...
బాన్సువాడ, నవంబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఇంటి యజమాని సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి(Property Tax Payments) పురపాలక సంఘానికి సహకరించాలని బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్(Banswada Municipal Commissioner Gopu Gangadhar) కోరారు.పట్టణంలో ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమంలో భాగంగా శనివారం కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పాల్గొని పన్నుల వసూళ్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు ఇంటి పన్నుల చెల్లింపుపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక సంఘానికి వచ్చే ఇంటి పన్నుల ఆదాయం ఎంతో ముఖ్యమన్నారు. ప్రజలు చెల్లించే పన్నులే పట్టణ అభివృద్ధికి ఆర్థిక వనరుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఇంటి పన్నుల బకాయిలు పేరుకుపోకుండా ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా పన్నులు చెల్లించాలని సూచించారు. పన్నుల వసూళ్లకు మున్సిపల్ సిబ్బంది చేపడుతున్న కార్యక్రమానికి పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.