ఎల్‌నినోను తట్టుకునేలా ఆయిల్‌పామ్ యాజమాన్యం

21-11-2026 | 05:46pm

నీటి, పోషకాల సమర్థ వినియోగంతో అధిక దిగుబడులు సాధించవచ్చు 

ముత్తారంలో జిల్లా ఉద్యానవన అధికారి గడ్డం శ్యాంప్రసాద్

ముత్తారం, నవంబర్ 21(విజయక్రాంతి) : ఎల్‌నినో వాతావరణ(El Niño weather) పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్‌పామ్ రైతులు అప్రమత్తంగా ఉంటూ నీటి, పోషకాల యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యాంప్రసాద్ సూచించారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామంలో ఆయిల్‌పామ్(Oil Palm) సాగు, ఎల్‌నినో ప్రభావం(El Nino conditions), పంటల మార్పిడిపై రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ తోటల్లో సమర్థవంతమైన నీటి యాజమాన్యం, సమతుల్య పోషకాల వినియోగం ద్వారా పుష్పాల అభివృద్ధి, గెలల ఏర్పాటు, అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. స్లాషర్లు, ష్రెడర్లు, మినీ ట్రాక్టర్లు, బిందు సేద్య పరికరాల కొనుగోలుకు ఉద్యానవన శాఖ ద్వారా రాయితీలు అందిస్తున్నట్లు వివరించారు. ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చని, కోకో సాగుకు కూడా రాయితీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కిల్లా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకట రమేష్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి చేపట్టాలని, ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా వివిధ పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని పెంపొందించుకోవాలని, చీడపీడల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ భాస్కరరావు ఆయిల్‌పామ్ సాగులో ఎరువుల యాజమాన్యం, సమతుల్య పోషకాల వినియోగం, మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదల, అధిక దిగుబడుల సాధనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సాంకేతిక అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో రామగుండం ఉద్యానవన అధికారి జ్యోతి, ఉద్యానవన విస్తరణ అధికారి రాజశేఖర్, వ్యవసాయ శాఖ అధికారి అనూష, విస్తరణ అధికారి మనీషా, ఆయిల్‌పామ్ క్షేత్రస్థాయి సిబ్బంది, సర్పంచ్ రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ నాగినెని జగన్ మోహన్ రావు, రైతులు చల్ల సమ్మయ్య,  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు