డెత్ సర్టిఫికెట్ల రాకెట్...ముందే చెప్పిన విజయ క్రాంతి
బెల్లంపల్లి: అనధికారిక డెత్ సర్టిఫికెట్ల (Death Certificates) జారీ వెనుక అంతర్జిల్లా ముఠా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ వ్యవహారానికి బెల్లంపల్లి మండలం బూదఖుర్దు గ్రామ పంచాయతీ ప్రధాన కేంద్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రారంభమైన అక్రమ దందా మండలంలోని ఇతర గ్రామ పంచాయతీలతో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రం, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు విస్తరించినట్లు సమాచారం.
డెత్ సర్టిఫికెట్ల కేసులో తొలుత ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ అక్రమ వ్యవహారం వెనుక భారీ నెట్వర్క్ (Network) ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ రాకెట్ విస్తృతి ఇంత పెద్ద స్థాయిలో ఉందనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. కాగా, ఈ వ్యవహారాన్ని విజయక్రాంతి ముందుగానే వెలుగులోకి తెచ్చింది.
ఈ అక్రమ దందాలో కొందరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వారి పాత్రపై జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్, ఉపసర్పంచ్ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో డెత్ సర్టిఫికెట్ల అక్రమాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రాజకీయ పలుకుబడితో తప్పించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం (Political Interference)పై జిల్లాలో చర్చ జరుగుతోంది.
స్వయంగా బూదఖుర్దు పంచాయతీ కారోబార్ చిలుముల రవి అరెస్టుకు ముందే ఈ వ్యవహారంపై మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ప్రజాప్రతినిధులు, వారి బంధువుల పేర్లు బయటపెట్టవద్దని పోలీసులు తనపై ఒత్తిడి తెస్తున్నారని, బెదిరిస్తున్నారని వెల్లడించారు. వారిని కాపాడేందుకే రాజకీయ జోక్యంతో తనను డెత్ సర్టిఫికెట్ల కేసులో ఇరికించారని ఆరోపించారు.
అధికార పార్టీకి చెందిన రాజకీయ ప్రముఖులను కాపాడేందుకు ఎస్ఐ సైతం తనను బెదిరించారని కారోబార్ మీడియా ముందు వెల్లడించడం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు శనివారం రాత్రి 10.30 గంటల తర్వాత నిందితుల అరెస్టును ప్రకటించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు వివరాల వెల్లడిలో పోలీసులు గోప్యత పాటించడంపై విమర్శలు వస్తున్నాయి. రాత్రి 10.30 గంటల తర్వాతే అరెస్టులను ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీడియా కవరేజ్ (Media Coverage) తగ్గించేందుకే ఇలా వ్యవహరించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసు ప్రెస్ గ్రూపుల్లో పెట్టలేదా?
సాధారణంగా పోలీసులు కీలక సమాచారాన్ని మీడియాకు అందించేందుకు బెల్లంపల్లి డివిజన్, కమిషనరేట్ పేర్లతో నిర్వహిస్తున్న రెండు ప్రధాన గ్రూపులను ఉపయోగిస్తుంటారు. వార్త ప్రాధాన్యతను బట్టి ఆయా గ్రూపుల్లో వివరాలు వెల్లడిస్తుంటారు. అయితే జిల్లాలో చర్చనీయాంశంగా మారిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం (Scam) నిందితుల అరెస్టు వార్త మాత్రం ఈ రెండు ప్రధాన పోలీసు గ్రూపుల్లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది.
ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే అరెస్టు వివరాలను పరిమితంగా ప్రచారం చేశారా? అనే చర్చ మీడియా వర్గాల్లో సాగుతోంది. కీలకమైన డెత్ సర్టిఫికెట్ల రాకెట్ నిందితుల అరెస్టు వివరాలను రాత్రి వేళ వెల్లడించి, మీడియాకు సమాచారం అందకుండా చూశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితుల అరెస్టు వార్తకు తక్కువ ప్రచారం వచ్చేలా పోలీసులు ఆచితూచి వ్యవహరించారా? అసలు సూత్రధారులను కాపాడే ప్రయత్నం జరిగిందా? ఐదుగురి అరెస్టుతోనే ఈ కేసు ముగిసిపోతుందా? అనే ప్రశ్నలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కీలక కేసుకు సంబంధించిన వివరాలను సకాలంలో మీడియాకు అందించడంలో బెల్లంపల్లి పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.