రీ సర్వే పనులను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్
కామారెడ్డి, నవంబర్ 12 (విజయక్రాంతి): జిల్లాలో భూమి రి సర్వే పనులను(Land re-survey work) వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్(District Collector Ashish Sangwan) అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో భూమి రీసర్వే పనులపై సమీక్ష నిర్వహించారు. రోజువారీ పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలి అన్నారు.
జిల్లాలో కొనసాగుతున్న భూ, రీ సర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతిరోజూ చేపడుతున్న సర్వే పనుల పురోగతిని సమీక్షించాలని, రోవర్ పరికరాల పనితీరు, వాటి వినియోగం, సర్వే బృందాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
జిల్లాలో 70 కాడాస్ట్రల్ రీ సర్వే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన అనంతరం వెంటనే సర్వే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామసభలు పూర్తయిన గ్రామాల్లో ఎలాంటి జాప్యం లేకుండా పనులను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
జిల్లాలో మొత్తం 158 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉండగా, వారిలో 144 మంది తమ సమ్మతిని తెలియజేశారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రస్తుతం 50 సర్వే బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి ఒక లైసెన్స్డ్ సర్వేయర్‌ను కేటాయించి పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, గిరి, జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.