సమాజంలో పోలీసు పాత్ర కీలకం
బెజ్జూర్ అక్టోబర్ 28 (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బెజ్జూర్ పోలీస్ స్టేషన్‌లో(Bejjur Police Station) ఎస్‌ఐ కె. రమేష్(SI K. Ramesh) ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌లోని విధులు, పోలీస్ శాఖ పనితీరు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ,
ప్రజలకు పోలీసులందించే సేవల గురించి ఎస్‌ఐ కె. రమేష్ వివరించారు. పోలీస్ శాఖలో వినియోగించే వివిధ పరికరాలు, పోలీసుల విధులు, బాధ్యతల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, చట్టాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు..
ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసుల సహాయం తీసుకోవాలని తెలిపారు.పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, సమాజంలో పోలీసుల పాత్రను విద్యార్థులకు తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.