ప్రభుత్వ వైద్యులపై ఎమ్మెల్యే ఆగ్రహం

27-11-2026 | 05:17pm
  1. ఐదుగురు వైద్యుల్లో నలుగురు విధులకు గైర్హాజరు?
  2. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజలకు వైద్యం అందించరా?
  3. జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరతపై ఎమ్మెల్యే అసహనం?

జుక్కల్, నవంబర్ 27 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Government hospitals) ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(Jukkal MLA Thota Lakshmikanta Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఈ నెలలోనే రెండుసార్లు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యేకు వైద్యుల గైర్హాజరు, సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైంది.

ప్రభుత్వం కొత్తగా వైద్యులను నియమిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఎందుకు కొనసాగుతోందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులు విధులు నిర్వహించాల్సి ఉండగా, నలుగురు వైద్యులు విధులకు హాజరుకాకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఒకే ఒక్క వైద్యుడు అందుబాటులో ఉండటంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు ఎలా అందుతాయని అధికారులను నిలదీశారు. ప్రభుత్వం నుంచి నెలనెలా జీతాలు తీసుకుంటూ విధులకు హాజరుకాకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద,

మధ్యతరగతి ప్రజలకు సకాలంలో వైద్యం అందకపోతే వారు ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వైద్యులు స్థానికంగా నివాసం ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధులకు గైర్హాజరవడం, సమయపాలన పాటించకపోవడం వంటి అంశాలపై ఎమ్మెల్యే హెచ్చరించినట్లు తెలిసింది.

ఇకనైనా వైద్యులు తమ పనితీరును మార్చుకుని విధులను సక్రమంగా నిర్వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

మరిన్ని వార్తలు