రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ (Road Safety Committee) సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. జిల్లాలో ప్రమాదాల నివారణ, భద్రతా చర్యల అమలు, ప్రమాదాలు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
తెలంగాణ ప్రభుత్వం రోడ్డు భద్రతా చర్యల (Safety Measures) అమలుకు ప్రతి జిల్లాకు రూ.కోటి నిధులు కేటాయించిందని కలెక్టర్ తెలిపారు. ఈ నిధులను జిల్లాలో రోడ్డు భద్రత మెరుగుదలకు వినియోగించాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో (Coordination) కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రవాణా నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధించడంతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారం అవసరమైన అప్రోచ్ రోడ్డు అనుమతులు లేని, సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందని దాబాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రమాదాలు తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ అంజయ్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖలతోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.