కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా తరలించాలి

28-11-2026 | 06:27pm

కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,(విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని జిల్లాలో కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు త్వరగా తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల, శెట్టిపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల(Paddy Procurement Centers)ను క్షేత్రస్థాయిలో సందర్శించి, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ, నిల్వలు, రవాణా, నిబంధనల అమలు, సదుపాయాల కల్పన తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు(Farmers) ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం ధాన్యాన్ని సేకరించాలని, తేమ శాతం పరిశీలన, నాణ్యత ప్రమాణాల నిర్ధారణ వంటి ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా జిల్లాలో సామర్థ్యం మేరకు కేటాయించిన ప్రకారం సంబంధిత రైస్ మిల్లులకు త్వరితగతిన తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ధాన్యం నిల్వలు పేరుకుపోవడం వల్ల కొత్తగా ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా నీడ, త్రాగునీరు సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, ప్యాడి క్లీనర్లు, డ్రయ్యర్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర అందేలా కొనుగోలు కేంద్రాల సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు