ఖేలో ఇండియాలో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలి
జిల్లా కలెక్టర్ అంకిత్
డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు
జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని(Sports Culture) మరింతగా ప్రోత్సహించడం, యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు ఖేలో ఇండియా కార్యక్రమంలో(Khelo India Programme) భాగంగా క్రీడా సంబరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడా సంబరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారని, 27 రకాల క్రీడాంశాల్లో 33 జిల్లాలు, 6 నగరాలు, 20 వేదికల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు అందించే సర్టిఫికెట్లకు భవిష్యత్తులో మంచి ప్రాధాన్యత ఉంటుందని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.క్రీడలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కావని, శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి సుగుణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో విద్యార్థులకు ఈ క్రీడా పోటీల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ఆవరణలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.