పే స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాకే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలి
భిక్కనూర్, నవంబర్ 19 (విజయ క్రాంతి): ఏళ్ల తరబడి విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్(Contract in universities) పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు ముందుగా పే స్కేల్ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) సౌత్ క్యాంపస్‌లో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్ట్‌టైమ్ అధ్యాపకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా బోధన, పరిశోధన రంగాల్లో సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తమకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
కొత్త నియామకాలకు ముందు ఇప్పటికే సేవలందిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని, సమాన పనికి తగిన వేతనం, పే స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ అధ్యాపకుల సేవలు కీలకమని, తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. నారాయణ, డా. యాలాద్రి, డా. సునీత, డా. రమాదేవి, డా. నిరంజన్ శర్మ, శ్రీకాంత్, డా. సరిత పిట్ల, దిలీప్, పార్ట్‌టైమ్ అధ్యాపకులు డా. కనకయ్య, డా. పోతన్న, మహిపాల్, శ్రీనివాస్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.